దిలావర్పూర్ అక్టోబర్ 8 : పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు…గ్రామాలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుటుందని నమ్మిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామాల్లో పరిపాలన భవనాలు బాగుంటేనే గ్రామం బాగుటుందనే నమ్మకంతో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలతో పాటు, శిథిలావస్థలో ఉన్న గ్రామపంచాయతీల భవనాలను గుర్తించి వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మించేందుకు సర్కారు ముందుకు వచ్చింది. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రరణ్రెడ్డి, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ జిల్లాకు నూతనంగా 130 గ్రామ పంచాయతీలను మంజూరు చేసి నిధులను విడుదల చేశారు. ఈ నిధులతో గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల ఏర్పాటుకు సంబంధిత శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనులు ప్రారంభిస్తున్నారు.
జిల్లాలో 130 జీపీ భవనాలు మంజూరు
నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలను కలుపుకొని నూతన పంచాయతీ భవనాల ఏర్పాటుకు ఉపాధి హామీ పథకం నిధుల కింద 130 గ్రామపంచాయతీలు మంజూరయ్యాయి. ఒక్కోక్క గ్రామపంచాయతీ భవనానికి రూ. 20 లక్షలను మంజూరు చేసింది. ఈ నిధులతో భవనాలు నిర్మించేందుకు కొన్ని గ్రామాల సర్పంచ్‌లు ముందుకు వచ్చి పనులు చేపట్టుతున్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని 52 గ్రామపంచాయతీలు, ముథోల్ నియోజక వర్గంలో 50 గ్రామపంచాయతీలు, ఖానాపూర్ నియోజకవర్గంలో 28 నూతన జీపీ భవనాలకు నిధులు మంజూరు చేసింది. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు.
అత్యధిక పంచాయతీ భవనాలు కుభీర్, మామడకు మంజూరు..
నిర్మల్ జిల్లాలని కుభీర్ మండలంలోని అత్యధికంగా 17 గ్రామ పంచాయతీ నూతన భవనాలు మంజూరయ్యాయి. అదేవిధంగా నిర్మల్ నియోజకవర్గంలోని మామడ మండలంలోని 15 గ్రామ పంచాయతీలు మంజూరయ్యాయి. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు నూతన భవన నిర్మాణం కోసం రూ. 20 లక్షలను మంజూరు చేసింది.
కొత్త పంచాయతీకి నూతన భవనం ముంజూరైంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 500లకు పైగా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. అందులో మా ఊరు గ్రామ పంచాయతీగా ఎంపికై ఎన్నికలు నిర్వహించారు. నేను మొదటి సారిగా ఏర్పడిన పంచాయతీకి సర్పంచ్ కావడం ఆనందంగా ఉంది. తక్కువ సమయంలో రాష్ట్ర మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి కృషితో మా గ్రామానికి నూతన గ్రామపంచాయతీ భవనం మంజూరు కావడం ఆనందంగా ఉంది. ఈ భవన నిర్మాణ పనులను రెండు మూడు రోజుల్లో ప్రారంభిస్తాం.
-రొడ్డ మహేశ్ ,సర్పంచు మాయపూర్
నూతన భవనం కట్టడం ఆనందం కలిగించింది..
నేను సర్పంచ్ అయిన తరువాత నా హయాంలో నూతన గ్రామ పంచాయతీ భవనం కట్టి అందులో నుంచి పాలన కొనసాగించడం ఎంతో ఆనందం కలిగించింది. మా గ్రామంలో సంవత్సరాల తరబడి పంచాయతీ భవనం ఉండపోయేది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయించడంతో మండలంలోని మోడల్ గ్రామ పంచాయతీగా నిర్మాణం చేపట్టాను. పంచాయతీ భవనం కట్టాలనే నా కోరిక నేరవేరింది.
– గంగారెడ్డి, సర్పంచు సిర్గాపూర్