లక్ష్మణచాంద, మే 3 : తెలంగాణ రాకముందు దండుగలా మారిన వ్యవసాయాన్ని పండుగలా మార్చి చూపించామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని రైతువేదికలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 70 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, మరో ఇద్దరికి రైతు బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడక పూర్వం ఆంధ్రపాలకులు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం ద్వారా నీరు వంటి చర్యలు తీసుకోవడంతో వ్యవసాయం పండుగలా మారిందన్నారు.
ఆడపిల్లల పెండ్లి కుటుంబానికి భారం కాకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో రూ.లక్షా నూట పదహార్లు ఆర్థికసాయంగా అందజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభు త్వం గురుకులాలు, కస్తూర్బా పాఠశాలల ద్వారా బాలికలకు ఉచిత విద్యతోపాటు నాణ్యమైన భోజ నం అందుతుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో బాల్యవివాహాలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ చర్యలతో ప్రతి ఇంటికీ ఏదో రకంగా ఫలితాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, మంత్రి సోదరుడు, బీఆర్ఎస్ మండల ఇన్చార్జి అల్లోల సురేందర్ రెడ్డి, ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ కవితారెడ్డి, ఎంపీడీవో మోహన్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతో మానసిక ప్రశాంతత
మామడ, మే 3 : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని న్యూసాంగ్వీ గ్రామంలో రూ.15 లక్షలతో నిర్మించిన సాయిబాబా ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో భీమన్న ఆలయానికి రూ.10 లక్షలు, శుక్రవారం అమ్మవారి ఆలయానికి రూ.10 లక్షలు మంజూరు చేశామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమానికి కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కైరాం సుజాత శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి-రాంకిషన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఏనుగు లింగారెడ్డి, డీఎస్పీ జీవన్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్రశేఖర్‌గౌడ్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సామ వికాస్‌రెడ్డి, కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, ఉప సర్పంచ్ అశ్విన్‌రెడ్డి, ఎంపీడీవో రమేశ్, భూషణ్‌రెడ్డి, సంజీవరెడ్డి, లింగన్న, ఛత్రపతి రెడ్డి, రాంరెడ్డి, నల్ల లింగారెడ్డి, ఏ రమేశ్‌రెడ్డి, సాగర్, రఘు, అశోక్, అలీం తదితరులున్నారు.