సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రంగ దవాఖానల్లో తెలుగు రాష్ర్టాల్లోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్వహణ అయోమయంగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న సూపరింటెండెంట్ ఇన్చార్జ్ హోదాలోనే పనిచేస్తుండడంతో దవాఖానకు, రోగులకు పూర్తిస్థాయి న్యాయం జరగడం లేదు. ఈ సమయంలో దవాఖానకు కొత్త సూపరింటెండెంట్‌ను నియమిస్తున్నట్లు రోజుకో కొత్త వార్త వినిపిస్తుండటంతో ఎప్పుడు ఎవరు వస్తారో, ఎవరు పోతారో తెలియక దవాఖాన సిబ్బంది అయోమయ పరిస్థితులకు గురవుతున్నారు. రెండేళ్లుగా వైద్య ఆరోగ్యశాఖనే అయోమయంగా మారిందంటూ పెదవి విరుస్తున్నారు వైద్య సిబ్బంది.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్దల అండ ఉన్నవారినే అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పైరవీలు చేసుకున్న వారిదే పై చేయి అంటున్నారు బాధిత సిబ్బంది. బదిలీ అయినా, పోస్టింగ్ అయినా, పదోన్నతి అయినా.. పని ఏదైనా సరి పైస లేనిదే ఫైలు కదలడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు పెద్దల అనాలోచిత నిర్ణయాలతోనే నగరంలోని ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అస్థవ్యస్థంగా మారుతోందని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న నిలోఫర్ దవాఖాన సూపరింటెండెంట్ వివాదం.. నిన్న వివాదాస్పదంగా మారిన ఎంఎన్‌జే దవాఖాన డైరెక్టర్ నియామకం.. తాజాగా ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ నియామకం కొత్త వివాదానికి దారితీస్తోంది.

Osmania Hospital
సూపరింటెండెంట్ నియామకంలో అయోమయం
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సాధారణ బదిలీలలో ఉస్మానియాలోని చాలామంది సీనియర్ ప్రొఫెసర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్పటి సూపరింటెండెంట్ డా.నాగేందర్ సైతం బదిలీ కావడంతో ఆ స్థానంలో ఎండోక్రైనాలజి విభాగాధిపతి డా.రాకేశ్ సాహెను ఉస్మానియా ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా నియమించారు. ఆయన రెండు బాధ్యతలూ చూసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా కొడంగల్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.రాజుకు ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఈనెల 13న ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు డా.రాజు రెండు రోజుల క్రితం దవాఖాన ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఉస్మానియాకు వచ్చారు. చార్జ్ తీసుకునే ఆఖరు క్షణంలో ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశాఖ నుంచి మెయిల్ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఒక్కసారిగా అందరూ ఖంగుతిన్నారు.
ఆరోగ్యశాఖలో అన్నీ షాకింగ్ ఉదంతాలే..
మొన్నటికి మొన్న డీఎంఈ పరిధిలో పనిచేసే ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తిగల నిమ్స్ వైద్యుడిను నియమించారు. దీనిపై ఇంకా అక్కడి వైద్యులు, సిబ్బంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొడంగ్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఉస్మానియా సూపరింటెండెంట్‌గా అదనపు బాధ్యతలు కట్టబెడుతూ హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పదవి చాలా కీలకమైనది.
అదే సమయంలో ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ పోస్టు కూడా అత్యంత కీలకమైనది. ఇంత ప్రాధాన్యత గల రెండు పోస్టులను ఒకే వ్యక్తికి ఎలా కట్టబెట్టేందుకు ప్రయత్నించారో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. కొడంగల్ ప్రిన్సిపాల్ అక్కడ కళాశాలను ఎలా నడిపిస్తారు, నగరంలో ఉన్న ఉస్మానియా దవాఖానను ఎలా నిర్వహిస్తారో ఉత్తర్వులు జారీచేసిన అధికారులకే తెలియాలని మండి పడుతున్నారు వైద్యసిబ్బంది. కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు తీసుకునే అనాలోచిత నిర్ణయాల కారణంగా అటు వైద్యులు, సిబ్బందే కాకుండా ఇటు రోగులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.