మన్సూరాబాద్, ఆగస్టు 12: తాను పనిచేస్తున్న పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలోనే యువ కానిస్టేబుల్ ఉరేసుకొని మృతిచెందడం సంచలనం రేపింది. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నది. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, బండలేమూరు, హజ్నా తండాకు చెందిన జర్పుల బోద్య, విజయ దంపతులకు ఇద్దరు కొడుకులు సేవల్, సాయికుమార్ (25), ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కొడుకు సేవల్ పెద్ద అంబర్‌పేట్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సాయికుమార్ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. జనరల్ డ్యూటీతోపాటు ఈ కాప్స్‌లో విధులు నిర్వర్తించేవాడు. ఈ నెల 3న ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ నుంచి అతడిని ఇదే ఠాణాపైన ఉండే ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
మంగళవారం రాత్రి 9 గంటలకు విధుల్లో చేరాడు. రాత్రి 2:30 గంటల సమయంలో సాయికుమార్ రెస్ట్రూమ్లో ఉరేసుకొని కనిపించాడు. వెంటనే ఎల్బీనగర్లోని కామినేని దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ ముందు బుధవారం ఆందోళనకు దిగారు. ఏసీపీ కార్యాలయంలో ఫర్నిచర్, కంప్యూటర్లు, ప్రింటర్లను ధ్వంసం చేశారు. సాయికుమార్ రాసిన సూసైడ్ నోట్ మాయం కావడం, ఏసీపీ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సాయికుమార్ సెల్‌ఫోన్‌ను సైతం పోలీసులే స్వాధీనం చేసుకొని అందులో డాటా తొలగించారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి చేరుకొని మృతుడి కుటుంబానికి సంఘీభావం తెలిపారు. మృతుడి తండ్రి బోద్య ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.