గ్రామీణ పేదలకు పని కల్పించి, కనీస ఆదాయ భద్రత కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఐజీఎన్ఆర్ఈజీఎస్) కాలక్రమేణా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. తాజాగా జూలై 1, 2026 నుంచి ఎంఎన్ఆర్ఈజీఏ స్థానంలో వికసిత్ భారత్గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ జీ రామ్ జీ) అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం కింద ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినప్పటికీ..వాస్తవంగా గ్రామీణ కూలీలకు అందుతున్న పనిదినాలు, కూలీ రేటు, నిధుల లభ్యతే కీలకంగా మారాయి.
2025లో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 లక్షల కుటుంబాలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్నాయి. అయితే ఒక్కో కుటుంబానికి సగటున లభించిన పనిదినాలు కేవలం 28 రోజులు మాత్రమే. పూర్తి 100 రోజులు పనిచేసిన కుటుంబాలు సుమారు 6 వేలే. అంటే చట్టపరంగా 100 రోజుల హామీ ఉన్నప్పటికీ, వాస్తవ ఉపాధి దానికి చాలా దూరంగా ఉన్నదని గణాంకాలు చెప్తున్నాయి. 2025-26లో తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఉపాధి హామీ కూలి రోజుకు రూ.307. కానీ వాస్తవంగా కార్మికులకు చెల్లించిన సగటు కూలి రూ.259 మాత్రమే. అంటే ఒక్కో పనిదినానికి సగటున రూ.48 తక్కువ. 28 రోజుల సగటు ఉపాధిని లెక్కలోకి తీసుకుంటే ఒక్కో కుటుంబానికి సుమారు రూ.1,344 వరకు ఆదాయ వ్యత్యాసం ఏర్పడుతున్నది.
వీబీ జీ రామ్ జీలో పనిదినాలను 125కు పెంచారు. అయితే చాలా రాష్ర్టాలకు ఈ పథకం వ్యయంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించే విధానం అమల్లో ఉన్నది. దీంతో ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న రాష్ర్టాలు తమ వాటా నిధులు సమకూర్చడంలో ఇబ్బంది పడితే, పనుల మంజూరు, పనిదినాలు, కూలీల చెల్లింపులపై ప్రభావం పడే అవకాశం ఉన్నది. 200910లో కేంద్ర స్థాయిలో సగటు ఉపాధి హామీ కూలి రూ.88.48గా ఉన్నది. అదే ఏడాది కూలీలకు చెల్లించిన వేతనాలపై రూ.18,806.39 కోట్లు ఖర్చయినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వార్షిక నివేదిక పేర్కొన్నది. 201314లో ఎంఎన్ఆర్ఈజీఏపై వాస్తవ కేంద్ర వ్యయం రూ.38,602 కోట్లు. ఆ ఏడాది ఒక్కో కుటుంబానికి సగటున 45.9 రోజుల ఉపాధి లభించింది.
కేసీఆర్ ప్రభుత్వ (20142023) కాలంలో తెలంగాణలో ఉపాధి హామీ పథకం ఎలా పెరిగిందో అధికారిక ప్రభుత్వ గణాంకాలతో చూడవచ్చు. తెలంగాణ ప్రభుత్వ సోషియో ఎకనామిక్ ఔట్లుక్ 2024లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం 201415లో ఉపాధి హామీపై మొత్తం వ్యయం రూ.2,038 కోట్లు ఉండగా, 202122లో రూ.4,671 కోట్లకు చేరింది. అంటే సుమారు 129 శాతం పెరిగింది.
అదే సమయంలో పనిదినాలు 201415లో 10.57 కోట్లు కాగా, 202021లో కరోనా కాలంలో అత్యధికంగా 15.79 కోట్లకు చేరాయి. ఇది 201415తో పోలిస్తే దాదాపు 49% పెరుగుదల. 201819లోనే గణనీయమైన పురోగతి కనిపించింది. 25.2 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించగా, 11.7 కోట్ల పనిదినాలు సృష్టించారు. ఒక్కో కుటుంబానికి సగటున 46.5 రోజులు పని లభించింది. అదే ఏడాది 2,24,366 కుటుంబాలు 100 రోజుల ఉపాధిని పూర్తి చేశాయి. పథకంపై మొత్తం రూ.3,027 కోట్లు ఖర్చయ్యాయి. 202021లో కరోనా కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం డిమాండ్ పెరుగడంతో సుమారు 30 లక్షల కుటుంబాలు, 52 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వచ్చారు. 13.6 కోట్ల పనిదినాలు డిసెంబర్ 2020 నాటికే నమోదయ్యాయి.
2025 ఏప్రిల్సెప్టెంబర్ మధ్య తెలంగాణలో ఉపాధి హామీ పనిదినాలు, అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 47.6 శాతం తగ్గాయి. దేశవ్యాప్తంగా ఇదే కాలంలో తగ్గుదల 10.4 శాతం మాత్రమే. అదే సమయంలో పని పొందిన కుటుంబాలు 25.33 లక్షల నుంచి 19.94 లక్షలకు తగ్గాయి. అంటే 21.3 శాతం తగ్గుదల కనిపించింది. ఒక్కో కుటుంబానికి సగటు పని రోజులు 41 నుంచి 27 రోజులకు పడిపోయాయి. కేసీఆర్ పాలనలో 202122లో 14.75 కోట్ల పనిదినాలు, 202223లో 12.19 కోట్లు, 202324లో 12.09 కోట్లు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 202526లో పనిదినాలపై తీవ్ర తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా 2025 ఏప్రిల్సెప్టెంబర్ కాలంలో 47.6% పతనం నమోదవడం గమనార్హం. హామీ కాగితాలపై కాకుండా చేతల్లో ఉండాలి. ఉపాధి హామీ పథకం లక్ష్యం పేద కుటుంబాలకు కనీస జీవన భద్రత కల్పించడం. కనుక పనిదినాల సంఖ్య పెంచడమే కాకుండా, నిర్ణయించిన పూర్తి కూలి చెల్లింపు, సకాలంలో వేతనాలు, పని కోరిన ప్రతి కుటుంబానికీ ఉపాధి అమలు కావాలి.
(వ్యాసకర్త: సామాజికవేత్త, విశ్లేషకుడు)
-డా.మోటె చిరంజీవి
9949194327