హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): జీవనది మూసీ పునరుజ్జీవం పేరిట కాంగ్రెస్ ప్రజాధనం లూటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నది. నదిలో పేరుకుపోయిన మురుగును శాస్త్రీయంగా శుద్ధి చేయగా… పరీవాహక ప్రాంత జనాలను నిండా ముంచి, రియల్ వ్యాపారానికి తెరలేపింది. ఇందుకు ఎందుకూ పనికిరాని, క్షేత్రస్థాయిలో మూసీ నదీ వ్యవస్థపై ఎలాంటి అవగాహన లేని సింగపూర్ కంపెనీ మెయిన్‌హార్ట్ వంటి ఏజెన్సీకి రూ. 133 కోట్ల ప్రజాధనాన్ని కట్టబెట్టింది. తాజాగా పర్యావరణ ప్రభావ అంచనా(ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) కోసం సేకరించిన ప్రాథమిక వివరాలన్నీ లోపాభూయిష్టంగా ఉండగా.. క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా ఉంది. ఈ నివేదికలో చెప్పిన గణాంకాలు, అస్తవ్యస్తమైన ప్రణాళికలు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు నూటికి నూరుపాళ్లు నిజమని స్పష్టం అవుతుంది. విదేశీ కన్సల్టెన్సీల అవగాహనారాహిత్యాన్ని నివేదిక బట్టబయలు చేసింది. వెలుగులోకి వచ్చిన లోపాలను సవరించుకునేలా, కోట్ల రూపాయలను విదేశీ సంస్థలకు కట్టబెట్టి… లోపాల సవరణకు తెలంగాణ ఇంజినీర్లతో అధ్యయనం చేయించేందుకు సర్కార్ సమాయత్తం అవుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. మూసీ నదీ పునరుజ్జీవం పేరిట వేల కోట్ల రూపాయల ప్రజాధనంపై కాంగ్రెస్ సర్కార్ కన్నేసింది.
నది వెంబడి విధ్వంసకరమైన ప్రణాళికలతో కాంక్రీట్ సమాధిని నిర్మించేందుకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో అడ్డువచ్చిన మూసీని ఎకోలజీని దెబ్బతీసి, పరీవాహక ప్రాంత పర్యావరణ వ్యవస్థపై మారణహోమానికి తెగబడింది. ప్రాజెక్టు అంచనాలు, పర్యావరణ అభ్యంతరాలను పరిశీలించిన స్టేట్ లెవల్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ(ఎస్‌ఈఏసీ) ముందు ఈ నివేదికలోని అశాస్త్రీయ విధానాలు, లెక్కల గోల్మాల్ బహిర్గతం కావడం మూసీ నది పునరుజ్జీవంపై సర్కార్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయింది. మొదట సమర్పించిన ప్రతిపాదనల్లో రూ. 5,641 కోట్లు ప్రాజెక్టు అంచనా వ్యయం, కమిటీ సమావేశం నాటికి ఒక్కసారిగా రూ. 7,055కోట్లకు ఎలా పెరిగిందనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పెరిగిన రూ. 1,414 కోట్ల వ్యయానికి సంబంధించిన అధికారిక డీపీఆర్, బీవోక్యూ పత్రాలు లేకుండా అంచనాలను ఎలా పెంచారనేది ఇప్పుడు అంతు చిక్కని అంశంగా మారింది. అదేవిధంగా ప్రారంభంలో మూసీ పరీవాహక ప్రాంతంలో 1400 నిర్మాణాలు ప్రభావితం అవుతున్నాయని చెప్పిన ప్రభుత్వం… తుది నివేదిక వచ్చేసరికి ఈ సంఖ్యను 639కు తగ్గించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అశాస్త్రీయంగా పర్యావరణ అధ్యయనం..
పర్యావరణ ప్రభావంపై అంచనా వేసిన ఏజెన్సీ అత్యంత కీలకమైన నీరు, మట్టి, పూడిక శాంపిళ్ల సేకరణలో అశాస్త్రీయ విధానాలతో రూపొందించినట్లుగా తెలుస్తున్నది. ముసాయిదా నిబంధనల ప్రకారం ఫేజ్-1 కింద ప్రతిపాదించిన 20.5కి.మీ పరిధిలో ప్రతి అర కి.మీటర్‌కు ఒక శాంపిల్ చొప్పున 41 ప్రాంతాల్లో మట్టి, పూడిక, వాటర్ శాంపిల్ సేకరించి ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలి. కానీ ఈ ఏజెన్సీ మాత్రం కేవలం 21 ప్రాంతాల నుంచే నమూనాలను సేకరించి, వాటి ఆధారంగా నివేదికను రూపొందించి చేతులు దులుపేసుకున్నది. మూసీ నదిలో ఏకంగా 44.94లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తవ్వి, తొలగిస్తామని వెల్లడించింది. అలాంటప్పుడు అసమగ్రమైన శాంపిళ్లతో ఆ మట్టిలోని విషపూరిత రసాయనాల తీవ్రతను ఏవిధంగా అంచనా వేస్తుందనే ప్రశ్నకు దారితీస్తున్నది. తవ్వకాల ద్వారా వచ్చే దాదాపు 17.42లక్షల క్యూబిక్ మీటర్ల మిగులు మట్టిని ఎక్కడ భద్రపరుస్తారో, దానివల్ల పరిసర ప్రాంతాల భూగర్భజలాలు, భూమి కలుషిత తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందని చెప్పకుండా కాంగ్రెస్ సర్కార్ దాచిపెడుతున్నది.
మురుగునీటిపై అంకెల గారడీ…
మూసీ నది పునరుజ్జీవనానికి ప్రధాన అడ్డంకి మురుగు నీటి నిర్వహణ. యథేచ్ఛగా జీవనదిలో కలుస్తున్న మురుగునీటిని నియంత్రించకుండా పునరుజ్జీవం అసాధ్యమని ఓవైపు పర్యావరణవేత్తలు నెత్తీనోరూ మోదుకుంటున్నారు. కానీ సర్కార్ మాత్రం మురుగునీటి శుద్ధి, ఎస్టీపీల సామర్థ్యం విషయంలో ప్రభుత్వం సమర్పించిన గణాంకాల మధ్య భారీ వ్యత్యాసాలే కనిపిస్తున్నాయి. 2051 నాటికి మూసీ పరీవాహక ప్రాంతంలో రోజుకు 453 మిలియన్ లీడర్ల మురుగు నీరు ఉత్పత్తి అవుతుందని నివేదికలో అంచనా వేశారు. అయితే దీనిని శుద్ధి చేయడానికి ప్రస్తుతం ఉన్న ఎస్టీల సామర్థ్యం.. నిర్మాణంలో ఉన్నవి, అందుబాటులోకి వచ్చే ఎస్టీపీల సామర్థ్యం కేవలం 342 మిలియన్ లీటర్లు మాత్రమేనని పేర్కొన్నారు.
అంటే రోజుకు 114 మిలియన్ లీటర్ల మురుగు నీటిని మాత్రమే నేరుగా మూసీ నదిలోకి చేరుతుందని, దీనికితోడు ఒక్కో ఎస్టీపీ సామర్థ్యాన్ని నివేదికలోనే ఒక్కో రీతిలో పేర్కొనడం, ఇక నల్ల చెరువు ఎస్టీపీ సామర్థ్యాన్ని పట్టికలో 30ఎంఎల్డీలని, వివరణలో 86.5ఎంఎల్‌డీలను నమోదు చేయడంతో మూసీ నదీ పేరిట కాంగ్రెస్ చేస్తున్న అంకెల గారడీ తెలిసిపోతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇక మూసీలో కలిసే నాలాల సంఖ్యను కూడా ఒక్కో చోట ఒక్కో రీతిలో సర్కార్ పేర్కొంది. ఒక చోట 22అని చెప్పి… మరొక వివరణలో 9 అని ఎలాంటి జీఐఎస్ మ్యాపింగ్ వివరాలు లేకుండానే నివేదిక ఉందనే వెల్లడవుతుంది.
మూసీ పేరిట రియల్ దందా…
మూసీ నది పేరిట కాంట్రాక్టుల పేరిట ప్రజాధనం లూటీ చేయడం, సహజ సిద్ధమైన పర్యావరణ వ్యవస్థకు కాంక్రీట్ సమాధిని కట్టి, పరీవాహక ప్రాంతంలో రియల్ ఎస్టేట్ దందా చేసేలా కాంగ్రెస్ పనితీరు ఉందనీ తాజా నివేదికతో స్పష్టమవుతుందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. మూసీ పర్యావరణ వ్యవస్థపై ఎలాంటి అవగాహన లేకుండా, క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయకుండా కేవలం పరీవాహక ప్రాంతంలో 199.89 హెక్టార్ల విస్తీర్ణంలో పచ్చదనం, పార్కుల పేరిట కాంక్రీట్ కట్టడాలను నిర్మించనున్నది. ఈ నిర్మాణాల కోసం నది ఒడ్డున ఉన్న 2660 పాత మహావృక్షాలను నరికివేసేందుకు సిద్ధపడ్డారు. నదికి ఇరువైపుల కేటాయించిన 50మీటర్ల బఫర్ జోన్ వంద సంవత్సరాల వరద ముప్పును తట్టుకుంటుందా? లేదా అనే అంశంపై ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం జరుగలేదు. కేవలం మూడు నెలల కాలంలో (అక్టోబర్-డిసెంబర్ 2025) సేకరించిన అరకొర బేస్ లైన్ డాటాతో రూపుదిద్దుకున్న ఈ నివేదిక కాంగ్రెస్ సర్కార్, భూ, ధన దాహానికి నిలువెత్తు సాక్ష్యమని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ డొల్ల నివేదికను పక్కనపెట్టి, తెలంగాణ ఇంజినీర్లు, స్వతంత్ర నిపుణులతో సమగ్రమైన శా్రస్త్రీయ అధ్యయనం జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
మూసీ ఈఐఏ నివేదికలోని లోపాలు…
