సిటీబ్యూరో/ఎల్బీనగర్, మార్చి 19(నమస్తే తెలంగాణ): డ్రగ్స్ విషయంలో చర్చకు రమ్మని వైట్ చాలెంజ్ విసిరిన కాంగ్రెస్ నాయకులు తోకముడిచారు. కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరి, వైట్ చాలెంజ్‌కు డుమ్మా కొట్టారు. దీంతో డ్రగ్ టెస్ట్‌లో దొరికిపోతామనే భయంతోనే నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు రాలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. వైట్ చాలెంజ్‌కు స్పందించి గురువారం ఎల్బీనగర్ చౌరస్తాకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు చేరుకోవడంతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి అడ్డుకున్నారు.
కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై కూర్చొని ఆందోళన చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఏసీపీ కృష్ణయ్య బీఆర్ఎస్ నాయకులను ముందుకు వెళ్లనీయలేదు. అప్పటికే రోడ్డు అవతలి పక్కన ఉన్న కాంగ్రెస్ నాయకులు కొందరు రోడ్డు మధ్యలోకి వచ్చి ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రాం విగ్రహం వద్దకు వచ్చి కూర్చున్నారు. సవాల్ విసిరిన కాంగ్రెస్ నాయకులు డ్రగ్ టెస్ట్‌పై నోరు మెదపలేదు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తూ, కాంగ్రెస్ నాయకులకు మాత్రం రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేసేందుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడంతో నెమ్మదిగా స్పందించిన పోలీసులు ఇరువర్గాలను అడ్డుకొని అందులో కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
ఎలాంటి దురలవాటు లేదు: ఎమ్మెల్యే, సుధీర్‌రెడ్డి
42 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో నాకు ఎలాంటి చిన్న దురలవాటు లేదు. అనుచరులకు కూడా ఎవరికీ దురలవాట్లు లేవు. వైట్ చాలెంజ్‌లో డ్రగ్ టెస్ట్‌కు మధుయాస్కీ, మల్రెడ్ది రాంరెడ్డి వస్తున్నారని చెప్పారు. వాళ్లు రాకపోవడం వల్ల అనుమానాలు వస్తున్నాయి. వాళ్లేమైన డ్రగ్స్ తీసుకున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. నేను, మా క్యాడర్ అంతా టెస్ట్‌లకు సిద్ధంగా ఉన్నాం. క్రమ శిక్షణతో మేం రాజకీయాలు చేస్తున్నాం. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు చేశాం. మా కార్యకర్తలు ఎవరూ డ్రగ్స్‌కు అలవాటు పడ్డవాళ్లు లేరు. పార్టీ శ్రేణులు మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు నిరూపిస్తే.. ఎప్పుడైనా రక్తనమూనాలు ఇచ్చేందుకు సిద్ధం.