కడెం, ఆగస్టు 3 : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ రైతులు అటవీ శాఖ అధికారుల తీరుపై సోమవారం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. అటవీ భూముల్లో గిరిజన, గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్లో ట్రాక్టర్ వాడకాన్ని నిషేధించాలని అధికారులు ఆంక్షలు విధించడం, గ్రామంలోని 17 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టడంపై మండిపడ్డారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ఎలాంటి సహాయం అందించకుండా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు.
కాగా.. సోమవారం సహాయ నిరాకరణపై స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఇక నుంచి అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి తాగునీరు, విద్యుత్, నిత్యావసర సరుకుల సహాయం చేయకూడదని తీర్మాణించారు. అటవీ శాఖ అధికారులు అడ్డుపడితే మూకుమ్మడిగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తీర్మాణం చేశారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తేనే, సాగులో సహకరిస్తేనే అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన, గిరిజనేతర రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.