లక్నో: ఒక సైనికుడి మృతదేహాన్ని తరలిస్తున్న ఆర్మీ అంబులెన్స్ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. జవాన్ కుమారుడు, బంధువులు, డ్రైవర్ సహా నలుగురు ఈ ప్రమాదంలో మరణించారు. (Ambulance Carrying Soldier’s Body Crash) ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. మరణించిన సుబేదార్ మేజర్ సత్యవాన్ మృతదేహాన్ని ఆర్మీ అంబులెన్స్‌లో చండీగఢ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఉన్న ఆయన స్వగ్రామం గలియా దుధైల్లాకు తరలిస్తున్నారు.
కాగా, ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో అయోధ్య-సుల్తాన్పూర్ సరిహద్దు సమీపంలోని హలియాపూర్ ప్రాంతంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే పక్కన నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఆర్మీ అంబులెన్స్ వేగంగా ఢీకొట్టింది. అందులో ప్రయాణించిన ఆ సైనికుడి ఏకైక కుమారుడైన 28 ఏళ్ల గౌరవ్ సింగ్, అంబులెన్స్ డ్రైవర్ 30 ఏళ్ల జస్పాల్ అక్కడికక్కడే మరణించారు. సైనికుడి సోదరుడైన 35 ఏళ్ల రాజన్ చౌదరి, మేనల్లుడైన 40 ఏళ్ల రామ్ సమూజ్ సింగ్, అయోధ్య జిల్లాలోని పిత్లా-కుమార్‌గంజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నలుగురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబాలకు ఈ సమాచారం అందించారు. ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసేవరకు సుబేదార్ మేజర్ సత్యవాన్ మృతదేహం ఉన్న శవపేటికను హలియాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచారు. జిల్లా కలెక్టర్ ఇంద్రజీత్ సింగ్, సుల్తాన్పూర్ ఎస్పీ వినీత్ జైస్వాల్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.