నిర్మల్ అర్బన్, అక్టోబర్ 27: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని, మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని మంత్రి, నిర్మల్ ఎమెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పలు వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వృద్ధులు, మహిళలను, ఆప్యాయంగా పలకరిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను వివరిస్తూ మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు.
అంతకుముందు ఇంద్రకరణ్ రెడ్డి ప్రచార రథంలో బంగల్‌పేట్‌కు రాగా, బీఆర్ఎస్ శ్రేణులు, బైక్ ర్యాలీగా ఆయన వెంట వచ్చారు. డప్పులు, బ్యాండు మేళాలతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో ఎదురువచ్చి బొట్టు పెట్టి తమ కాలనీల్లోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని తెలిపారు. ప్రస్తుత మ్యానిఫెస్టోలో ఉన్న హామీలను తప్పకుండా అమలు చేస్తామని అన్నారు.
ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ వివరిస్తూ ఓట్లు అడగాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని, ఇప్పుడే తాము అధికారంలోకి వచ్చినట్లు సీఎం అయినట్లు భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని, దానిని అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇక బీజేపీ మతతత్వ ధోరణితో వెళ్తున్నదని, ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. బంగల్పేట్ దసరా వేడుకల్లో బీజేపీ నేత ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం హేయమని మండిపడ్డారు.

పట్టణంలోని బంగల్పేట్ మహాలక్ష్మీ అమ్మవారిని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టణంలోని 2,3,4,5 వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన మంత్రికి కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు అందించి కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, ప్రజలు తదితరులున్నారు.
సోన్, అక్టోబర్ 27: పదేళ్లలో రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు ఓటేయ్యాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ కండువాలు కప్పి వారందరినీ ఆహ్వానించారు.
అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. సమీపంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగడం లేదని, రాష్ట్రం లాంటి పథకాలు ప్రవేశపెడితే బాగుంటుందని అక్కడి ప్రజలు కితాబునిస్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వెల్మల్ గ్రామానికి చెందిన వందలాది మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. సోన్ బీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, మండల ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గ్రామ సర్పంచ్ అంకం గంగామణి శ్రీనివాస్, కిరణ్‌కుమార్, పార్టీ అధ్యక్షుడు దొడ్డి నర్సయ్య, మాజీ సర్పంచ్ లత శ్రీనివాస్, తదితరులున్నారు.