సారంగాపూర్, జూలై 20 : కరెంట్ ఇవ్వకుండా నాడు రైతులను ఇబ్బంది పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని.. మళ్లీ అధికారంలోకి వస్తే కోతలు తప్పవని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన రైతుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 24 గంటల కరెంట్ వ్యవసాయానికి ఇవ్వడంతో పాటు లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇస్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని మతిభ్రమించి మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నాయుడుని ప్రజలు బంగాళాఖాతంలో కలిపారని, ఇప్పడు కాంగ్రెస్‌ను కూడా ప్రజలు బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర పడ్డాయన్నారు.
రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని రేవంత్‌రెడ్డి కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. రైతుల బతుకులతో ఆడుకుంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో రైతులు సమాధి కట్టడం ఖాయమని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసిన రైతులు మాత్రం బీఆర్ఎస్ పార్టీకే మూడో సారి పట్టం కట్టబోతున్నారని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తే తరమి కొట్టాలన్నారు. అనంతరం ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని, మూడు గంటలు వద్దు.. మూడు పంటలు కావాలని బీఆర్ఎస్ నాయకులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ నారాయణరెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, ఆలూర్ సొసైటీ చైర్మన్ ఎలిపెద్ది మాణిక్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ దత్తురాం, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఎంపీటీసీ భోజారెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ ఇప్ప మధుకర్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఇస్మాయిల్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, మల్లేశ్, రవీందర్‌రెడ్డి, భూమేశ్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.