నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 24: సంత్ సేవాలాల్ మహారాజ్ మార్గం అనుసరణీయమని, అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సేవాలాల్ మహారాజ్ జయం తి వేడుకలను నిర్మల్‌లో అధికారికంగా నిర్వహించారు. పట్టణంలోని మల్లన్నగుట్ట సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అల్లోలతో పాటు ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖా నాయక్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఆల్ ఇండియా బంజారా సంఘం నాయకుడు, మాజీ మంత్రి అమర్‌సింగ్ తిలావత్‌తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా బంజారాలకు కేటాయించిన భూమిలో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడేళ్లలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రిగా తనకు దక్కిన అవకాశం గొప్ప అనుభూతి మిగిల్చిందన్నారు.దేశంలో బంజారాలను గుర్తించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులందరికీ పట్టాలను త్వరలో అందిస్తామని మంత్రి ప్రకటించారు. అంతకుముందు సేవాలాల్ మహారాజ్ చిత్రపటం వద్ద పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోనే సంత్ సేవాలాల్ జగదాంబదేవి ఆలయం నిర్మల్‌లోనే మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తున్నామని చెప్పారు. నిధుల మంజూరుకు కృషి చేస్తానిని మంత్రి హామీనిచ్చారు. తక్షణమే రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి, పత్రాలను బంజారా సంఘ సభ్యులకు అందించారు. అదనంగా మరో రూ.50 లక్షలు ఇస్తామని చెప్పారు. గిరిజన ఆలయాల్లో కూడా పూజారులను నియమించి వేతనాలు అందిస్తామని చెప్పారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 500 దేవాలయాల పునర్నిర్మాణానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిధులు మంజూరు చేయడం హర్షనీయమన్నారు. 500 జనాభా ఉన్న ప్రతి గిరిజన తండాను పంచాయతీగా ఏర్పాటు చేయడంతో ఆదివాసీ గిరిజనులు ప్రజాప్రతినిధులుగా తండాలను అభివృద్ధి చేసుకునే అవకాశం దక్కిందని ఎమ్మెల్సీ దండె విఠల్ గుర్తు చేశారు.
బంజారా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు, మహిళలు బంజారా వేషధారణతో పాటలు, నృత్యాలు, డోలు వాయిద్యాలతో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున బంజారా తరలివచ్చారు. ఆలయ నిర్మాణానికి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ రూ. 5లక్షలు, బంజారా సంఘం టీఆర్ఎస్ నేత రాజేశ్ నాయక్ రూ. 1.50 లక్షలు, పంచాయతీరాజ్ డీఈ తుకారాం రూ. 1. 50 లక్షల విలువైన చెక్కులు అందించారు. అంతకుముందు బంజా రాల ఆరాధ్య గురువు లింబాద్రి మహారాజ్‌ను ఊరేగింపుగా గుర్రంపై తీసుకొచ్చారు. కార్యక్రమంలో నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీలు రామేశ్వర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజిగారి రాజేందర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, జడ్పీటీసీలు అల్కాతాయి, జానుభాయి, ఎంపీపీలు సోను, బాపురావ్, నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్యాంనాయక్, గిరిజన సంక్షేమశాఖ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా ట్రాన్స్‌కో అధికారి జయంత్‌రావు చౌహాన్, ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ శంకర్, ఉత్సవ కమిటీ సభ్యులు బలరాం నాయక్, తుకారాం నాయక్, కళాకారులు మోహన్ నాయక్, ప్రేం, శంకర్ నాయక్, వెంకట్రావ్ నాయక్, రాజన్ననాయక్, బాపురావు నాయక్ ఉన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ కరపత్రంతో పాటు సీడీలను విడుదల చేశారు.
నిర్మల్‌లోని రాజరాజేశ్వర గార్డెన్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ దండె విఠల్ చెక్కులు పంపిణీ చేశారు. నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్‌తో పాటు ఏడు మండలాల పరిధిలో 378 మందికి చెక్కులు అందించారు.
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 24 : నిర్మల్ పట్టణ అభివృద్ధికి త్వరలో మరో రూ.25 కోట్లు రానున్నాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని చైన్‌గేట్ నుంచి పోస్టాఫీస్ వరకు రూ. 2 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలో రోడ్డు విస్తరణ, మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయని రూ. 5 కోట్లతో బీటీ రోడ్డు పనులు పూర్తి చేసి ఇరువైపులా డ్రైనేజీలు నిర్మిస్తున్నామని ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయిస్తున్నామని చెప్పారు. పట్టణంలోని ధర్మసాగర్ జాతీయ జెండా వద్ద రూ.1.50 కోట్లతో చేపట్టబోయే సుందరీకరణ పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఏస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, అయ్యన్నగారి రాజేందర్, ఎస్పీ రాజు, శ్రీకాంత్, పూదరి రాజేశ్వర్, బిట్లింగ్ నవీన్, నాయకులు అడ్ప పోశెట్టి, కోటగిరి అశోక్, ముడుసు సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము పాల్గొన్నారు.