ఆదిలాబాద్, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లావాసులను చలి వణికిస్తున్నది. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. రోజు రోజుకు చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇదేం చలిరా బాబూ అంటూ బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం 11 డిగ్రీలు, బుధవారం 8.5 డిగ్రీలు, గురువారం 7 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన చలి ఉదయం 9 గంటల వరకు కొనసాగుతోంది. బేల మండలంలో ఈ ఏడాది అత్యల్ప ఉష్ణోగ్రత గురువారం 7 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలోనే రికార్డ్ అయింది. ఆదివారం నుంచి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండగా.. రాబోయే రోజుల్లో చలి ప్రభావం పెరగనుందని ప్రజలు భయపడుతున్నారు.
రోజురోజుకు పెరుగుతున్న చలి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపశమనం కోసం రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. స్వెట్టర్లు, మఫ్లర్లు, మంకి క్యాప్‌లు ధరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రధాన రోడ్లతోపాటు వీధుల్లో జన సంచారం కనపడడం లేదు. జాతీయ రహదారి-44పై మంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్తున్నారు. పల్లెల్లో ప్రజలు చలి మంటలు వేసుకుని మంటలు కాగుతున్నారు. పట్టణాల్లో రూం హీటర్లను వినియోగిస్తున్నారు. వేడి కోసం ఛాయ్‌లు తాగుతుండడంతో టీ దుకాణాల వద్ద జనసంచారం కనపడుతున్నది. చలికి తోడు ఈదురుగాలులు వీస్తుండడంతో చలి తీవ్రత అధికంగా ఉంటుంది.