ఎదులాపురం, నవంబర్ 10 : మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్న కార్మికులకు అన్యాయం చేసేలా పథకాన్ని ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు అన్నారు. తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల పెండింగ్ వేతనాలు, బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఈనెల 24న కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్టు పేరొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీతమ్మ, ఆశమ్మ, యశ్వంత్ రావు, లక్ష్మి, ఇస్రు, గంగయ్య, రేఖబాయి, తదితరులు పాల్గొన్నారు.

సోయా కొనాలని అధికారుల నిలదీత
కుంటాల, నవంబర్ 10 : కుంటాల మండలంలోని లింబా(కే)లో సోయా ఉత్పత్తులు కొనుగోలు చేయాలని అధికారులను నిలదీశారు. ఈ నెల 6వ తేదీన ప్రారంభించినప్పటికీ.. టోకెన్లు జారీ చేయలేదని, కొనడం లేదని సోమవారం ఆ గ్రామ రైతులు మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయానికి వచ్చారు. తేమ శాతం వచ్చిన టోకెన్లు జారీ చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రామానికి చెందిన సుమా రు 40 మంది సోయా కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్పందించిన అధికారులు కొనుగోళ్లు ప్రారంభిస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.

పత్తి రైతుల ఆందోళన
భైంసా, నవంబర్ 10 : తేమ, నాణ్యత పేరిట సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు ఇబ్బంది పెడుతున్నారని పత్తి రైతు లు వాపోయారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని భగవతి కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు పత్తి కొనుగోళ్లు నిలిచిపోయా యి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లు నిర్వాహకులు తేమ శాతం, కౌడి పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు, దళారులు ఇష్టారీతిన నాణ్యత లేని పత్తి విక్రయిస్తున్నా రైతులను నిబంధనల పేరిట ఇబ్బందులకు గురి చేయడంపై మిల్లు నిర్వాహకులు, సీసీఐ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సీసీఐ సిబ్బంది సముదాయించడంతో ఆందోళన విరమించారు.