నిర్మల్, మే 31(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో మైక్రో ఫైనాన్స్‌ల లొల్లి మొదలైంది. రెండేళ్ల క్రితం వరకు పెద్ద ఎత్తున తమ కార్యకలాపాలను సాగించి వివాదాల్లో కూరుకుపోయిన ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు అప్పటి నుంచి కనుమరుగయ్యాయి. అప్పట్లో పోలీసులు అక్రమ మైక్రో ఫైనాన్స్‌లపై కఠిన చర్యలు తీసుకోవడంతో వారంతా గతంలోనే తోకముడిచారు. అయితే కొంతకాలం నుంచి మళ్లీ చాపకింద నీరులా పలు ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.
ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలకు చెందిన సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లోని స్లమ్ ఏరియాల్లో నివసించే కొంతమంది మహిళా పొదుపు సంఘాల సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి సహకారంతో ఇతర మహిళలకు బలవంతంగానే రుణాలు అంటగట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో అతి తక్కువ వడ్డీ అని చెప్పి రుణాలు ఇచ్చిన ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు, ఆ తర్వాత వాయిదాల రూపంలో రుణాలు తీసుకున్న మహిళల నుంచి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తుండడం వివాదాలకు కారణమవుతున్నది. ఇటీవల నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన దాదాపు 100 మందికి పైగా మహిళలు కలెక్టర్‌ను కలిసి స్వయంగా ఫిర్యాదు చేసి మైక్రో ఫైనాన్స్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కొన్ని మైక్రో ఫైనాన్స్ సంస్థలు అమాయక మహిళలకు అవసరం లేకున్నా రుణాలు ఇచ్చి వారి నుంచి వాయిదాల రూపంలో వడ్డీ డబ్బులను అధికంగా వసూలు చేస్తున్నాయి. ఒకటి, రెండు రోజులు వడ్డీ చెల్లింపులు ఆలస్యమైతే మహిళలకు పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తూ వారి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. అధిక వడ్డీపై మహిళలు ప్రశ్నిస్తే మైక్రో ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు దురుసుగా మాట్లాడుతున్నారు.
అసలు డబ్బులతోపాటు వడ్డీ డబ్బులు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణాలు తీసుకున్నవారితోపాటు గ్యారెంటీగా ఉన్న వారిని వేధింపులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వసూళ్ల కోసం తమ ప్రాంతాల్లోకి వస్తున్నారంటేనే రుణాలు తీసుకున్నవారు వణికి పోతున్నారు. ఇప్పటికైనా వారి ఆగడాలకు చెక్ పెట్టాలని బాధితులు కోరుతున్నారు.