ఎదులాపురం, ఏప్రిల్ 27 : కానిస్టేబుల్ తుది రాత పరీక్ష(ఈ నెల 30న)కు ఆదిలాబాద్ జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి సూచించారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గురువారం పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, బయోమెట్రిక్ నిర్వహణ సిబ్బందితో పరీక్ష ఏర్పాట్లపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసి, పరీక్ష సజావుగా నిర్వహించేలా అధికారులకు సూచనలు చేశామన్నారు. జిల్లా కేంద్రంలో 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తంగా 4,824 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని వెల్లడించారు. అభ్యర్థులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. అభ్యర్థులు 8:45 గంటలకే పరీక్షా కేంద్రానికి రావాలని, ఉదయం 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, సీ సమైజాన్‌రావు, బీ రాములునాయక్, పరీక్ష రీజనల్ కో ఆర్డినేటర్ జగ్రామ్ అంతర్వేది, జాకీర్‌హుస్సేన్ తదితరులున్నారు.