ఎదులాపురం, మార్చి 14 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల ఎక్సైజ్ అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రాష్ర్టాల మ ధ్య దేశీదారు, మద్యం, నాటు సారా, గంజాయి రవాణా విక్రయాలను అరికట్టేందు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, నేరస్తుల సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, కలిసి దాడులు నిర్వహించాలన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా డీపీఈవోలు నందగోపాల్, జ్యోతికిరణ్, చంద్రపూర్ జిల్లా ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.