జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాల విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని.. రెండో సంవత్సరంలోకి అడుగిడుతున్నది. విశాలమైన తరగతి గదులు, ప్రత్యేకమైన ల్యాబ్‌లు, మ్యూజియంలు, లైబ్రరీలు, ప్రొజెక్టర్లు, ఎల్సీడీ స్క్రీన్లు, సరిపడా బోధనా సిబ్బంది ఇలా సకల సౌకర్యాలతో వైద్యవిద్య కొనసాగుతున్నది. 2023-24 విద్యా సంవత్సరానికిగాను సీట్ల భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తికాగా, అక్టోబర్‌లో తరగతులు ప్రారంభించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తున్నది. ఇక ప్రస్తుతం ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులకు నవంబర్‌లో ఫైనల్ పరీక్షలు నిర్వహించి.. డిసెంబర్లో సెకండియర్ తరగతులు మొదలుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నది.
మాది మంచిర్యాలలోని గోపాల్‌వాడ. నాన్న డీఆర్డీఏలో కాంట్రాక్ట్ ఉద్యోగి. అమ్మ గృహిణి. నేను స్థానికంగా ఉన్న కార్మెల్ స్కూల్లో పదో తరగతి దాకా చదువుకున్నా. ఇంటర్ వరంగల్‌లో పూర్తి చేశాను. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని నీట్ రాశాను. 454 మార్కులు వచ్చినయ్. మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు దొరికింది. ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం గ్రేట్. ఈ నిర్ణయం వల్లే సొంతూరులో చదువుకునే అవకాశం వచ్చింది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది.
మంచిర్యాల ఏసీసీ, సెప్టెంబర్ 24 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాల మరో అడుగు ముందుకేసింది. మొదటి సంవత్సరం విజయవంతం గా పూర్తి చేసుకొని.. సెకండియర్లోకి అడుగుపెడుతున్నది. ప్రథమ సంవత్సరం చదువుతున్న 100 మంది విద్యార్థులు సెకండియర్లోకి వెళ్లబోతుండగా, 2023-24 సంవత్సరానికి సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యింది.
2022-23 విద్యా సంవత్సరంలో 100 సీట్లు కేటాయించారు. 85 శాతం రాష్ట్ర కోటాలో, మిగిలిన 15 శాతం ఆలిండియా కోటాలో సీట్లు భర్తీ చేశారు. వైద్య విద్య ప్రవేశాలు పొందిన వారిలో అత్యధికంగా బాలిక లు ఉండడం విశేషం. 35 మంది బాలురు, 65 మంది బాలికలున్నారు. ఇక ఈ ఏడాది కూడా 100 మందికి ప్రవేశం కల్పించారు. ఇందులోనూ దాదాపు 60 మంది బాలికలు ఉండగా, మిగతా 37 మంది బాలురు ఉన్నా రు. ఇందులో రాష్ట్రానికి సంబంధించి 85 శాతం అడ్మిషన్లు పూర్తి కాగా, ఆలిండియా కోటాకు సంబంధించి 13 మంది అడ్మిషన్లు పొందారు. మిగతా ముగ్గురు విద్యార్థులు చేరేందుకు 20 రోజుల గడువు ఉంది.
గతేడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతు లు ప్రారంభంకాగా, యాజమాన్యం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సౌకర్యాలు కల్పించింది. అనాటమీ ల్యాబ్, ప్రత్యేక తరగతి గదులు, ల్యాబ్‌లు, సెంట్రల్ లైబ్రరీ, విశాలమైన గదులు నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చింది. అనాటమీ తరగతుల నిర్వహణకు అవసరమైన మృతదేహాలను భద్రపరిచేందుకు అధునాతన సదుపాయాలు కల్పించింది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను పూర్తిస్థాయిలో నియమించి బోధన చేపట్టింది.
2023-24 విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ త్వరలోనే పూర్తి కానున్నది. వచ్చే అక్టోబర్ 3న నూతన విద్యార్థులు, తల్లితండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించి.. మరుసటి రోజు (4వ తేదీ) నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతుండగా, నవంబర్‌లో ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నది. ఇక ఫలితాలు వెలువడగానే డిసెంబర్ మొదటి వారంలో ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు.
మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాం. మొదటి సంవత్సరం సక్సెస్ ఫుల్‌గా సాగింది. ప్రస్తుతం మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ దాదాపు పూర్తికావచ్చింది. వీరికి అక్టోబర్‌లో తరగతులు ప్రారంభిస్తాం. ప్రస్తుతం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నవంబర్‌లో ఫైనల్ పరీక్షలు ఉంటాయి. ఫలితాలు వెలువడగానే డిసెంబర్లో ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభిస్తాం.
సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు. ఇది గొప్ప విషయం. విదేశాలకు వెళ్లి లక్షలు పోసి చదివే మెడిసిన్ సీటు ఇక్కడే ఉచితంగా వచ్చింది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ వైద్య కళాశాలలో కార్పొరేట్‌కు దీటుగా సకల సౌకర్యాలు కల్పించి వైద్య విద్య అందిస్తున్న సర్కారుకు రుణపడి ఉంటాం.