మంచిర్యాల, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లా వాసులకు ఈ ఎండాకాలం తాగునీటి తిప్పలు తప్పేలా లేవు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో రోజురోజుకూ నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్ట్ మొత్తం కెపాసిటీ 20.175 టీఎంసీలు కాగా మంగళవారం నాటికి 8.746 టీఎంసీలకు తగ్గింది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్ట్‌లో 8 టీఎంసీల నీరు ఉంది. అంటే దాదాపు గతేడాది పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది.
ఉన్న కొద్దిపాటి నీటిలో ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ 330 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీటిని ప్రతి రోజూ వాడుతున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ పట్టణాలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు 81 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నారు.
ఇవి కాకుండా ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం 91 క్యూసెక్కుల నీరు ఆవిరైపోతున్నది. ప్రస్తుతం ఉన్న నీరు ఎండాకాలంలో తాగునీరు సరఫరా చేసేందుకు మాత్రమే సరిపోయేలా ఉంది. దీంతో గూడెం లిఫ్ట్‌తో పాటు నంది, వేమ్నూర్ పంప్ హౌస్‌లకు నీటి సరఫరాను నిలిపివేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో ప్రాజెక్ట్ నీటి మట్టం డెడ్‌స్టోరేజీకి వెళ్లే ప్రమాదం ఉందని ప్రాజెక్ట్ అధికారులు అంటున్నారు.
మంచిర్యాల గ్రిడ్ పరిస్థితి ఏంటి..?
గతేడాది సైతం ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మంచిర్యాలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారుల ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంచిర్యాల పట్టణానికి తాగునీటి సరఫరా చేసే ఇన్‌టెక్‌వెల్ దగ్గర నీరు లేకుండా పోయింది. ఇక చిన్న కాలువ నుంచి నీరు వస్తున్నాయి. ప్రాజెక్ట్‌లో నీరు తగ్గితే ఆ కాలువ నీళ్లు ఎంత దాకా వస్తాయో తెలియని పరిస్థితి. గతేడాది ప్రాజెక్ట్‌లో నీరు ఉన్న దగ్గరి నుంచి ఇన్‌టెక్‌వెల్ దాకా కాలువలు తీశారు. మోటార్ల సాయంతో నీటిని చేరేలా చేశారు.
ఈ ఏడాది అలాంటి చర్యలేవీ ఇప్పటి దాకా చేపట్టినట్లు కనిపించడం లేదు. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఈ సారి నీరు ఎన్ని రోజులు ఉంటుందనే విషయంపై స్పష్టత కరువైంది. మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లోని దాదాపు 330 గ్రామ పంచాయతీలు, 20 తండాలు, గూడేలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోని మిషన్ భగీరథ గ్రిడ్ నుంచే తాగునీరు సరఫరా అవుతుంది. జిల్లాలో ప్రతి రోజూ 6.75 ఎల్ఎండీ నీరు అవసరం అవుతుంది. రెండేళ్ల క్రితం రుతుపవనాలు ఆలస్యమైనప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ సమయానికి 8 టీఎంసీల నీరు ఉంది.
కానీ అప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టును నింపుకునే అవకాశం ఉండడంతో సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. కాళేశ్వరంలో ఎత్తిపోస్తే ఎల్లంపల్లి మొత్తం నిండిపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాగునీటి నిర్వహణలో పూర్తిగా విఫలమైన సర్కార్ మేడిగడ్డ పిల్లర్‌ను రిపేర్ చేయకపోవడంతో ఎల్లంపల్లి ఎండిపోవాల్సిన దుస్థితి వచ్చింది. రెండేళ్ల క్రితం ఇదే సమయానికి బెడ్ లెవల్ 145 అడుగుల నీటితో నిండుకుండను తలపించిన ఎల్లంపల్లి ఇప్పుడు డెడ్‌స్టోరేజీకి చేరువ కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికైనా అధికారులు తాగునీటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోకపోతే మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో నీటి కటకట ఏర్పడే ప్రమాదం ఉంది.