నిర్మల్ చైన్గేట్, ఫిబ్రవరి 7 : మహిళల్లో గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్లు ఇటీవల బాగా పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని అడ్డుకట్టవేయాలని వైద్యశాఖ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. క్యాన్సర్ నివారణకు యుక్తవయస్సు అమ్మాయిలకు ప్రత్యేకంగా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. హెచ్పీవీ(హ్యుమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ను ఉచితంగా ఇచ్చేందుకు వైద్యశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
టీకా ఇచ్చేందుకు 7,546 మంది గుర్తింపు
మహిళలు ఎక్కువగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడుతున్నట్లు పలు సర్వేలో తేలింది. మోనోపాజ్ దశ దాటిన మహిళలు, సంతానం కాని వారు, బాల్యంలోనే వివాహాలు చేసుకున్నవారు, ఎక్కువ మందితో శారీరక సంబంధం కలిగి ఉన్నవారికి ఈ వ్యాధి సోకే ఆస్కారం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. యుక్త వయస్సులో 14, 15 ఏళ్లు వయస్సున్న అమ్మాయిలకు ఈ టీకాను ఇస్తే భవిష్యత్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. నిర్మల్ జిల్లాలో 7,546 మంది ఈ వయస్సున్న అమ్మాయిలు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ టీకాను ఉచితంగా ఇవ్వనుంది. ఇప్పటికే వైద్య సిబ్బందికి టీకా ఇచ్చే విధానంపై అవగాహన కల్పించారు.
క్యాన్సర్ నివారణకు చర్యలు ;– డాక్టర్ రాజేందర్, జిల్లా వైద్యాధికారి, నిర్మల్
నిర్మల్ జిల్లాలో క్యాన్సర్ నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. టీకా ఇచ్చేందుకు ఇప్పటికే కిశోర బాలికలను గుర్తించాం. టీకా ఇచ్చే విధానంపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే టీకాలు ఇస్తాం. ఈ టీకా తీసుకోవడం వల్ల భవిష్యత్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.