మందమర్రి: అంతర్జాతీయ యోగా (Yoga) దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి సింగరేణి గ్రౌండ్లో సామూహిక యోగా సాధన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యమని చాటుతూ, అదే వేదికగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధ వారోత్సవాల అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. యోగా మనస్సుకు ప్రశాంతతను, శరీరానికి దృఢత్వాన్ని ఇస్తుందన్నారు. అయితే, నేటి యువత మాదకద్రవ్యాల బారిన పడి తమ విలువైన భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మత్తు పదార్థాల మహమ్మారిని సమాజం నుంచి తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల అమ్మకం, సరఫరాకు సంబంధించిన అనుమానిత సమాచారాన్ని తక్షణమే పోలీసులకు అందించడం ద్వారా ప్రజలు తమవంతు సహాయాన్ని అందించాలని కోరారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్లో భాగంగా, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణ లక్ష్యంతో పోలీస్ శాఖ ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
శారీరక ఆరోగ్యానికి యోగా ఎంత అవసరమో, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం ద్వారా సామాజిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని దేవేందర్ అన్నారు. యోగా దినోత్సవం వంటి పవిత్రమైన వేదికపై మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించడం అభినందనీయమని మందమర్రి పోలీసులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాసిపేట, మందమర్రి ఎస్ఐలు రాజశేఖర్, పోలీస్ సిబ్బంది, సిబ్బంది, సింగరేణి అధికారులు, యోగా సాధకులు, మందమర్రి పట్టణ ప్రజలు పాల్గొన్నారు.