తాండూర్, మే 12 : వేసవి ఎండలు మండిపోతుంటే, మరోవైపు గొంతు ఎండిపోతోందని మంచిర్యాల జిల్లా తాండూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని మేదరి వాడ మహిళలు మంగళవారం రోడ్డెక్కారు.
గత నెల రోజులుగా వాటర్ ట్యాంక్ నుండి నీటి సరఫరా సరిగా లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ఖాళీ బిందెలతో భారీ ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ దాదాపు మూడు నెలల క్రితం నీటి సమస్య పరిష్కారం కోసం బోరు మాత్రం వేశారు. కానీ మోటర్ బిగించడం మర్చిపోయారు. ఇదే క్రమంలో నెల రోజులుగా నీటి ఎద్దడి మేదరి వాడలో ఉన్న వాటర్ ట్యాంక్ ద్వారా నీటి సరఫరా సరిగ్గా జరగడం లేదని, సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినా వారు ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో కనీసం తాగడానికి కూడా నీళ్లు లేకపోవడంతో అల్లాడిపోతున్నామన్నారు.
ధర్నా విషయం తెలుసుకున్న ఈవో దివాకర్ ఘటనా స్థలానికి చేరుకుని కాలనీ వాసులతో మాట్లాడారు. ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్న ఆయన నీటి సరఫరా పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వచ్చే రెండు రోజుల్లో ఈ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటాం అని ఈవో స్పష్టమైన హామీ లభించడంతో మహిళలు తమ ధర్నాను విరమించారు.