కాసిపేట, ఫిబ్రవరి 10 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను కాసిపేట మండల ట్రాక్టర్ యూనియన్ నాయకులు అడ్డుకున్నారు. వాగులో భారీగా ట్రాక్టర్లను పెట్టి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా అడ్డుకున్నారు. ఇసుక బుకింగ్ విధానం ఉండగా అక్రమ ఇసుక తరలింపు సరైంది కాదని మండిపడ్డారు. ఇసుక బుకింగ్ ద్వారా తరలించాలని నిబంధనలు ఉన్నా ఇలా త్వరగా ఇసుక పొందాలని, అధికంగా డబ్బు సంపాదించాలని అక్రమంగా తరలించడం ఏంటని ప్రశ్నించారు.
దీని ద్వారా త్వరగా ఇసుక పొందెందుకు అక్రమార్కులు ఆసరా చేసుకుని అధిక రెట్లకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ఆన్ లైన్ బుకింగ్ ఆలస్యం కావడంతో అక్రమార్కులు ఇసుక త్వరగా తెస్తుండడంతో దీని ద్వారా నిజాయితీగా ఇసుక తరలించే వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ట్రాక్టర్లలో నింపిన ఇసుకను పడేసి వెళ్లిపోయారు. ఈ మేరకు ట్రాక్టర్ల యాజమానుల మద్య కాసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెళ్లు వెత్తుతున్నాయి. రోడ్డును పక్కనే రోజు వారీగా అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.
అధికారులు అడ్డుకోవాల్సిన పనిని వారు పట్టించుకోకపోవడం వల్ల ట్రాక్టర్ యూనియన్ నాయకులు అడ్డుకోవాల్సిన పరిస్థితి నెలకొందనే విమర్శలు ఉన్నాయి. అధికారులు అక్రమార్కుల నుంచి మామూళ్లు తీసుకొని పట్టించుకోవడం లేదనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా కొంత మంది అధికారులకు సమాచారం ఇచ్చినా అక్రమార్కులకు ముందుగానే సమాచారం ఇచ్చి లాలూచి పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి వద్ద నుంచి గుడ్ విల్ కింద దండుకుంటున్నారే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషమంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని అక్రమ ఇసుక తరలింపు అడ్డుకట్ట వేయాలని, వాగులను కాపాడాలని పలువురు కోరుతున్నారు.