Telangana | మంచిర్యాల, మార్చి 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాలలో అంజలి మృతిపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి రామకృష్ణాపూర్ సమీపంలోని మామిడిగట్టు అటవీ ప్రాంతంలో అంజలి (21)తోపాటు పెరుగు మహేశ్వరి తీవ్రగాయాలతో పడి ఉండగా, వీరిని కారులో తీసుకొచ్చి మంచిర్యాల దవాఖానలో చేర్పించినట్టు అక్కడే ఓ కారు కన్సల్టెన్సీ నిర్వాహకుడు అజ్మీర శ్రీనివాస్ తెలిపాడు. అప్పటికే అంజలి మృతి చెందగా, మహేశ్వరి గొంతుపై తెగిన గాయాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
ఈ మేరకు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. నెన్నె ల మండలం మన్నెంగూడేనికి చెందిన మహేశ్వరి, అంజలి ఇద్దరూ సమీప బంధువులు. కొంతకాలంగా వీరు ప్రేమించుకుంటూ మం చిర్యాల కాలేజీ రోడ్లో ఓ రూమ్ అద్దెకు తీసుకొని ఉంటున్నారు. అంజలికి ఆమె తల్లిందండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. బుధవారం ఈ విషయంలోనే వారిద్దరి మధ్య గొడవలు జరిగాయా? లేక మరేదైనా కారణంతో వాళ్లు గొడవ పడ్డారా? అన్న అనుమానాలు కలుగుతున్నా యి.
ఈ కారణంగా బుధవారం రాత్రి అంజలి తన సొంతూరుకు బయల్దేరినట్టు సమాచారం. ఆమెను అనుసరిస్తూ మహేశ్వరి కూడా వెళ్లిందని, ఈ క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నదని అనుమానిస్తున్నారు. ఇద్దరూ ఒకరిని ఒకరు పొడుచుకున్నారా? లేక వేరే వ్యక్తుల ప్రమేయముందా? వారిని దవాఖానకు తీసుకొచ్చిన శ్రీనివాస్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. విచారణ అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. అంజలిది హత్యేనంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.