Mancherial | రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 10: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక 20వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంద వేణుగోపాల్‌పై ఆ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు వార్డులో ఓటుకు నోట్లు పంపిణీ చేస్తూ ఓటర్ల ప్రలోభపెటేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం తెలియడంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అక్కడికి చేరుకున్నారు. అధికారపార్టీ నాయకులు ఇంటింటి తిరుగుతూ ప్రచారం చేస్తూ కనిపించారు. ఇదేంటని ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కాంగ్రెస్ నాయకులు దురుసుగా ప్రవర్తించారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి వేణుగోపాల్‌పై దాడికి దిగారు.
మరోవైపు క్యాతన్ పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకునికి చెందిన కారును పార్క్ చేసి, డ్రైవర్ టీ కోసం వెళ్లారు. ఆ సమయంలో అక్కడే తనిఖీల నిర్వహిస్తున్న పోలీసులు కారులోని పర్సును తీసి అందులో రూ.34 వేల నగదు స్వాదీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళి పరిమితికి లోబడే డబ్బులు ఉన్నప్పటికీ స్వాధీనం చేసుకోవడం ఏమిటంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. ఎన్నికల అధికారుల తీరును, పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డు మీద బైటాయించి ఆందోళనకు దిగారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. క్యాతనపల్లిలో బీఆర్ఎస్, సీపీఐ గెలుపు ఖాయమైపోవడంతో తట్టుకోలేని అధికార పార్టీ దౌర్జన్యాలకు, దాడులకు దిగుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో గొడవలు జరుగుతుండగానే చెన్నూరు మున్సిపాలిటీలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం పై బాల్క సుమన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.”చెన్నూరులో అధికార కాంగ్రెస్ పార్టీ వికృత చేష్టలు.మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో అకారణంగా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూలరాజిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. పూర్తిగా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులు. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్లో అడ్డగోలు దౌర్జన్యాలు, బెదిరింపులతో అడ్డదారి తొక్కుతున్న కాంగ్రెస్ నాయకులు. ప్రచారం ముగించుకొని రెస్ట్ తీసుకుంటున్న బాల్క సుమన్ ఇంటిపై దాడి చేసి సాధించింది ఏమిటి?ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మంత్రి వివేక్ డబ్బు సంచులతో రామకృష్ణాపూర్ లో తిరిగింది అధికారులకు కనిపించలేదా.. క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి నానిని కిడ్నాప్ చేసిన వారిపై ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు.11వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి భూమన్న గౌడ్ ఇంటికి కార్యకర్తలు ఎవరు రాకుండా రోడ్డును ప్రోక్లైనర్ తో తవ్వించి శునకానందం పొందారు. ఈ రోజు రామకృష్ణాపూర్ లో మహిళ బ్యాగు లాక్కొని, అడ్డుగా వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్త పైన చేయి చేసుకున్న పోలీసులు. బీఆర్ఎస్ నాయకులు రాజి రెడ్డిని హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు. చెన్నూరు నియోజకవర్గం లోని రెండు మున్సిపాలిటీలలోని కార్యకర్తలు, నాయకులు, కార్మికులను అడ్డగోలుగా బెదిరిస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గం ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికలు కాకముందే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ని దౌర్జన్యాలు, బెదిరింపులు చేస్తున్నారంటే పొరపాటున కాంగ్రెస్ నాయకులు గెలిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.ఆలోచించి ఓటెయ్యండి.” అని బాల్క సుమన్ పోస్ట్ పెట్టారు.