కోటపల్లి, జూలై 29: మావోయిస్టు వారోత్సవాల (జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చెన్నూర్ రూరల్ సీఐ బన్సీనాయక్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్ నేతృత్వంలో కోటపల్లి మండల పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జాతీయ రహదారి, అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
తెలంగాణలోకి ప్రవేశిస్తున్న ప్రతి వాహనాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చినా, అనుమానాస్పదంగా సంచరించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ చర్యలకు ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టామని చెన్నూర్ రూరల్ సీఐ బన్సీనాయక్ తెలిపారు.