తాండూర్, మార్చి 10 : వార్డు సభ్యులు శిక్షణను సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్ధి దిశగా సమర్థంగా పనిచేయాలని బెల్లంపల్లి డీఎల్సీవో డీ సతీష్ కుమార్ సూచించారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డ్ సభ్యుల కోసం కొత్తపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి మంగళవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
పంచాయతీ రాజ్ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్ర ఎంతో ముఖ్యమని, గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో చురుకుగా వ్యవహరించాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థులకు సమర్ధవంతంగా చేరేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పీ ఎనివాస్, ఎంపీవో అనిల్ కుమార్, ట్రైనర్స్, నూతనంగా ఎన్నికైన వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.