తాండూర్, జులై 29: మంచిర్యాల జిల్లా తాండూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో నాగుల పంచమి (Nagula Panchami) పండుగను ఘనంగా నిర్వహించారు. వేకువ జాము నుంచే పిల్లలు పెద్దలు అందరూ తలారస్నానమాచరించి, నూతన వస్త్రాలు ధరించి, పుట్టలు, ఆలయాల వద్దకు వెళ్లి పుట్టలలో నాగ దేవతకు ఇష్టమైన చిమ్మిలి, చలిమిడి, అరటిపళ్లను, పాలను పోసి పూజలు నిర్వహించారు. తమ కుటుంబాల్లోని పిల్లాపాపలను సల్లంగా ఉండేలా చూడాలని మొక్కుకున్నారు.
శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం. ఈ రోజున పాలు, మిరియాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్క మొదలైన చేసిన నాగ పడిగెలకు భక్తులు ఆరాధిస్తుంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడే ‘నాగపంచమి’ నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీ దేవికి వివరించినట్లుగా స్కాందపురాణం చెబుతోంది.