తాండూర్, జనవరి 27 : మెరుగైన జీవనోపాధి కోసం ఉపాధి హామీ పనులను వినియోగించుకోవాలని తాండూర్ ఎంపీడీవో పీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా తాండూరు, రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న ఉపాధిహామీ పనులను ఏపీవో నందకుమార్ రెడ్డితో కలిసి సందర్శించారు. కూలీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉదయం సమయంలో వచ్చి ఉపాధి హామీ పనులు చేసుకుంటున్నట్లు కూలీలు వివరించారు.
దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ పని ప్రదేశంలో సంబంధిత వేజ్ సీకర్స్ కు తప్పనిసరిగా ఉదయం 7 గంటలకు పని ప్రదేశానికి చేరుకొని, సంబంధిత క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇచ్చిన కొలతల ప్రకారం పని చేయాలని సూచించారు. 2025-2026 ఆర్ధిక సంవత్సరం మార్చి 31 వరకు ముగుస్తుందని, ఉపాధిహామీ పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో వచ్చి మండల టార్గెట్ పనులు పూర్తి చేయాలన్నారు. దీంతో వచ్చే ఆర్ధిక సంవత్సరానికి మండలానికి ఉపాధిహామీ పనులు, నిధులు మరిన్ని ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నారు.