తాండూర్, సెప్టెంబర్ 19: మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, టీజీఎస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ అరెస్ట్ అప్రజాస్వామీకం అని మోకుదెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి బుసారపు మొండిగౌడ్ (Boosarapu Mondi Goud) అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ.. ఉదయం 5 గంటల నుంచి నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యనగర్‌లోని అమరవేణి నర్సాగౌడ్ నివాసంలో తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్, మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు, నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ళరాంపూర్ గ్రామంలో వీడీసీ గుండాల దాడిని ఖండిస్తూ నిరసన తెలియజే స్తున్నారు. అయితే.. వాళ్లను ఆక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌడ కులస్తులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మొండిగౌడ్ విమర్శించారు.
అమరవేణి నర్సాగౌడ్, పొన్నం నారాయణ గౌడ్లను అరెస్టు చేసి నిర్మల్ టౌన్‌కు తరలించారని, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వందలాది మంది మోకుదెబ్బ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని ఆయన తెలిపారు. అరెస్టు చేసి నిర్భందించడాన్ని తెలంగాణ గౌడసంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ, మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని మొండి గౌడ్ అన్నారు.
తాళ్ళ రాంపూర్ గ్రామంలో తాటి, ఈత చెట్లను గీసుకొని కల్లు అమ్ముకున్నందుకు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం.. ఇవ్వకుంటే సాంఘిక, కుల బహిష్కరణలు చేయడం దారుణమని ఆయన అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల ప్రజలను వేధించడం, పోలీస్, అబ్కారి శాఖల వారిపై, ప్రెస్ మీడియా ప్రతినిధులపై దాడులు చేసి చట్టాన్ని చేతిలోనికి తీసుకుంటున్న వీడీసీ వారి వెనుక ఉన్న వారిపై నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసులను పెట్టి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో తాళ్ళ రాంపూర్ వీడీసీపై చర్యలు తీసుకొనేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను కూడగట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మొండిగౌడ్ హెచ్చరించారు.