బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కెమికల్ ఏరియా జాతీయ రహదారిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) పీఏలు, క్యాడర్ హల్చల్ చేశారు. బహిరంగంగా మద్యం సేవిస్తూ డ్యాన్సులు చేస్తూ, చిందులు వేస్తూ కేరింతలు కొట్టారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రభుత్వ పీఏ రామకృష్ణ, డ్రైవర్ మోసిన్, శేఖర్, పీఏ గడ్డం ప్రసాద్, రామకృష్ణ, ఎమ్మెల్యే సన్నిహితుడు రమేష్, యూత్ నాయకుడు శ్యామ్ రోడ్డుపై చిందులు వేశారు.
అటువైపుగా వెళ్తున్న వాహన చోదకులు, ప్రజలు భయభ్రాంతులకు గురై ఇబ్బందులు పడ్డారు. నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ డ్యాన్సులు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో చిందులు వేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జల్సాలు చేసుకోవాలి కానీ ఇలా బహిరంగంగా చిందులు వేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.