తాండూరు, నవంబర్ 25 : ఏజెన్సీ కిష్టంపేటలోని సర్వే నంబర్ 23లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మంచిర్యాల జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు మండిగ రవీందర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన మంగళవారం నాయకులతో కలిసి తాండూరు తహసీల్దార్ జ్యోత్స్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత మంది గిరిజనేతరులు ఆ భూమి తమదంటూ ట్రాక్టర్లు పెట్టి చదును చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆరోపించారు.
ఇప్పటికే ఏజెన్సీలోని చాలా వరకు ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇతరులకు విక్రయించారన్నారు. దీనిపై తహసీల్దార్ వెంటనే అధికారులను అక్కడికి పంపించి ఆక్రమణను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ తాండూరు మండల ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, మాజీ సర్పంచి మణికుమార్, ఆదివాసీ కౌలవార్ సేవా సంఘం మండల అధ్యక్షుడు బాపు, మండల నాయకులు చిలుకయ్య, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.