రెబ్బెన, ఆగస్టు 6: దేశ స్వతంత్ర్యం కోసం బ్రిటీష్ వారితో జరిపిన ఉద్యమం మాదిరి మన నిధులు, నీళ్లు, నియామకాలు నినాదంతో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని ఏఐటీయూసీ బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం .శ్రీరమేష్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయం ఆవరణలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ..తెలంగాణ వెనుకబాటుతనం పోవాలంటే ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే సాధ్యం అని విద్యావంతుల్లో చైతన్యం నింపిన మహనీయుడు జయశంకర్ అని పేర్కొన్నారు. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని నమ్మిన వ్యక్తి అని ఆస్తుల కోసం కాకుండా ప్రజల కోసం సుదీర్గ పోరాటం చేసిన నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో AITUC గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్. తిరుపతి, అధికారుల సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు ఉజ్వల్ కుమార్ బెహరా , ఎన్. ఉమాకాంత్, డీజీఎం పర్సనల్ దేవరకొండ కిరణ్ బాబు, సీనియర్ పర్సనల్ అధికారి మండల శ్రీనివాస్, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.