హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 22 : వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు నిధులు ఖర్చు చేయడంలేదని వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఒప్పుకున్నారు. త్వరలోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ప్రారంభం అవుతుంది కదా అందుకే నిధులు ఖర్చు చేయలేదని అందుకే ఎంజీఎం దవాఖానకు ఈ దుస్థితి పట్టిందన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వరంగల్ ఎంజీఎం దవాఖాన శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతున్నాయి.
దవాఖానకు కావాల్సిన వసతులు, సౌకర్యాలు కల్పించడంలేదని, నిధులు ఖర్చు చేయలేదన్నారు.
వచ్చేనెల సీఎం చేతుల మీదుగా ప్రారంభించే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాల్సిన పరికరాలను, సదుపాయాలను సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కొందరు డాక్టర్ల స్వార్థంతో ఎంజీఎం నిర్లక్ష్యానికి గురవుతుంది, ఎంజీఎం దవాఖానలో వైద్యులు అందుబాటులో ఉండటంలేదన్నారు.
గతంలో ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వైద్యులు ఎంజీఎంకు రావడంలేదని, ప్రైవేటు క్లినిక్‌లోనే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా స్పెషల్ ఆఫీసర్‌గా ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ను నియమించాలన్నారు. హనుమకొండలో జీరో క్రైమ్ రేట్, ఎక్కడా కూడా ఒక్క కబ్జా లేదన్నారు.
రాముడి పేరిట 105 సార్లు బీజేపీ దోచుకున్నదన్నారు. వరంగల్ ఎయిర్‌పోర్టుకు డూప్లీకేట్ గాంధీ పేరు పెడతారని బండి సంజయ్ అనడం సరైంది కాదని, గాంధీ కుటుంబం గురించి మాట్లాడే స్థాయి లేదన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.