మంచిర్యాల : మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు గోడ కూలి మృతి చెందిన రైతుల కుటుంబసభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించారు. అకాల వర్షాల నుంచి పంటను కాపాడేందుకు వెళ్లి భారీ ఈదురు గాలులకు కల్లాల సమీపంలో ఉన్న గోడ కూలి నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
విషయం తెలుసుకున్న జీవన రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. అనంతరం లక్సెట్టిపేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకోలో పాల్గొన్నారు. ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.