– మంచిర్యాల, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిన్నమొన్నటి దాకా రైతు వ్యతిరేక చట్టాలతో ముప్పతిప్పులు పెట్టిన కేంద్రం.. ఇప్పుడు మరో కుట్రకు తెరలేపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.19.27 కోట్లతో 3,215 కల్లాలు నిర్మించగా, వాటికి వెచ్చించిన నిధులను వెనక్కి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నది. ఇతర రాష్ర్టాల్లో చేపలు ఎండబెట్టుకునేలా కల్లాల నిర్మాణానికి ‘ఉపాధి’ నిధులిచ్చి.. ఇలా తెలంగాణ రైతాంగంపై కక్షపూరితంగా ఉండడమేమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వరద పాలు కాకుండా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించడంపై కర్షకలోకం మండిపడుతున్నది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు వైఖరిపై నేడు(శుక్రవారం) జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పిలుపునివ్వగా, బీఆర్ఎస్ శ్రేణులతోపాటు రైతన్నలు స్వచ్ఛందంగా తరలిరావడానికి సిద్ధమవుతున్నారు.
స్వచ్ఛందంగా రైతులు తరలిరావాలి..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నది. కేంద్రం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు, రాష్ట్రంపై అసత్య ప్రచారం చేస్తున్నందుకు శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలి. రైతులు స్వచ్ఛందంగా పాల్గొనాలి. వీరితోపాటు బీఆర్ఎస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాలి.
డబ్బులు తిరిగి ఇవ్వాలనడం దుర్మార్గం
నా పేరు సంతోషుల మల్లక్క. మాది మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని ముత్తరావుపల్లి. మా పొలంలో రెండేండ్ల క్రితం కల్లం నిర్మించుకున్న. రాష్ట్ర సర్కారు డబ్బులు కూడా వెంటనే ఇచ్చింది. అంతకముందు రోడ్డు, మార్కెట్ ఆవరణలో వడ్లను ఆరబోసుకునేది. సానా ఇబ్బంది అయ్యేది. రాత్రి, పగలు కాపలా కాయాల్సి వచ్చేది. గిప్పుడు కల్లం నిర్మించుకోవడంతో రంది లేదు. కానీ.. కేంద్ర ప్రభుత్వం కల్లాలు కట్టుకునేందుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలనడం దుర్మార్గమైన చర్య.
ఆరుగాలం కష్టపడి.. రెక్కలు ముక్కలు చేసుకొని.. చేతికి వచ్చిన పంటను అమ్మేందుకు తీసుకుపోతే.. తేమ శాతం ఎక్కువ ఉంది ఆరబోయమనేటోళ్లు.. తీరా మార్కెట్లోనో, రోడ్ల మీదనో.. ఆరబోశాక వర్షమొచ్చి పంటను మొత్తం ముంచెత్తేది. పడ్డ కష్టమంతా వరదల్లో కొట్టుకుపోతుంటే చూసి లబోదిబోమని ఏడ్చుడు తప్ప.. చేయడానికి ఏముండేది కాదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్.. ఉపాధి హామీ నిధులతో పొలాల్లోనే సిమెంట్ కల్లాలు నిర్మించుకునే అవకాశం కల్పించారు. దీంతో 2020 జూన్ నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 3,215 కల్లాలు అందుబాటులోకి వచ్చాయి. వరి, మొక్కజొన్న, మిర్చిలాంటి పంటను ఆరబోసుకునేందుకు ఇవి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పంట కోసి రెండు రోజులు సిమెంట్ కల్లం మీద ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికివెళ్తే వెంటనే కొనేస్తున్నారు. వారం, పది రోజులు తిరగకముందే డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడుతున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, బాగుపడ్డ తెలంగాణ రైతుల బతుకులు చూసి కేంద్రం ఓర్వలేకపోతున్నది. ఉపాధి హామీ కింద నిర్మించిన కల్లాలకు సంబంధించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని రాష్ట్రంపై ఒత్తిడి తెస్తున్నది. ఈ లెక్కన తెలంగాణ కేంద్రానికి రూ.151 కోట్లు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తున్నది. కేంద్రం పెట్టిన ఈ తిరకాసుపై ఉమ్మడి జిల్లా రైతాంగం బగ్గుమంటుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరికాదని పెదవి విరుస్తున్నది.
నిర్మించిన కల్లాలు ఓకే.. నిర్మాణంలో ఉన్న పరిస్థితి ఏమిటి..
కేంద్రం నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో కల్లాలు నిర్మించుకుంటున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న రైతులు కొందరు డబ్బులు కూడా తీసుకున్నారు. కానీ.. నిర్మాణంలో ఉన్న వారికి డబ్బులు వస్తాయా.. రావా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు 1,454 కల్లాలు మంజూరు కాగా, ఇందులో ప్రస్తుతం 117 నిర్మించారు. మంచిర్యాల జిల్లాకు 1,777 కల్లాలు మంజూరు కాగా, ఇందులో 148 పూర్తయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో వరి సాగు తక్కువైనందున ఆ జిల్లాకు 1,157 కల్లాలు మంజూరయ్యాయి. దాదాపు అన్నిచోట్లా పూర్తయ్యాయి. ఇక నిర్మల్ జిల్లాకు 2,471 కల్లాలు మంజూరు కాగా, ఇప్పటి వరకు 1,793 కల్లాల నిర్మాణం పూర్తయ్యింది. ఈ నాలుగు జిల్లాల్లో కలిపి ఇప్పటి వరకు కల్లాల నిర్మాణం మీద దాదాపు రూ.19.27 కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుందనేది అధికారుల అంచనా.
మూడు రకాలుగా నిర్మాణాలు..
ఉపాధి హామీ కింద ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులు ఎవరైనా కల్లాలు నిర్మించుకోవచ్చు. 50 చదరపు అడుగుల్లో కల్లం నిర్మించుకుంటే రూ.56 వేలు, 60 చదరపు మీటర్లలో నిర్మించుకుంటే రూ.68 వేలు, 68 చదరపు మీటర్లలో నిర్మించుకుంటే రూ.75 వేలు చెల్లిస్తారు. ముందుగా రైతు కల్లం నిర్మించుకోవాలి. దానికి అయిన ఖర్చును విడుతల వారీగా రైతుకు తిరిగి చెల్లిస్తారు. ఇలా ఇప్పటి వరకు కల్లాలు నిర్మించుకున్న రైతుల్లో అనేక మందికి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలనడం సమంజసం కాదని రైతులు మండిపడుతున్నారు. ఎండనకా.. వాననకా.. కష్టపడే రైతులకు తెలంగాణ ప్రభుత్వం సాయం చేస్తుంటే.. సహకరించాల్సింది పోయి, ఇబ్బందుల పాలు చేయడంపై కన్నెర్ర చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో చేపలు ఎండబెట్టుకునే కల్లాల నిర్మాణానికి ఉపాధి హామీ నిధులు ఇచ్చిన కేంద్రం, తెలంగాణలో రైతులకు ఉపయోగపడే కల్లాలకు ఎందుకు ఇవ్వదో సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలే
ఇచ్చిన నిధులను వెనక్కి ఇవ్వమని అడిగే దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఇంత వరకు చూడలే. ఉపాధి హామీలో వ్యవసాయ పనులు చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఈ మేరకు కేంద్రం స్పందించపోయినా ఆయనే స్వయంగా జోక్యం చేసుకొని రైతులకు ఉపయోగపడేలా ఉపాధి నిధులను వాడుకుంటున్నారు. అది తట్టుకోలేక కండ్లమంటతో నిధులు తిరిగి ఇవ్వాలనడం అన్యాయం. వాళ్లు చేయరు చేసేవాళ్లను చేయనీయరు. తెలంగాణ విషయంలో కేంద్రానికి ఎందుకు అంత కక్షో అర్థం కావడం లేదు.
– వెన్నపురెడ్డి రాజిరెడ్డి, ముత్తరావుపల్లి, చెన్నూరు మండలం, మంచిర్యాల