నెన్నెల, మే 17: వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో పంట సాగు చేయడానికి పెట్టుబడి కోసం రైతులు బ్యాంకుల బాట పట్టారు. సాగుకు కావలసిన విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసం పంట రుణం తీసుకోవడానికి అన్నదాతలు వివిధ బ్యాంకులకు వెళ్తున్నారు. గత పంట రుణం వడ్డీతో చెల్లించి తిరిగి కొత్త రుణం తీసుకుంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరానికి రూ. 5వేలు పంట పెట్టుబడి సాయం కింద అన్నదాతలకు అందజేశారు. ఈ సాయం వల్ల రైతులకు కొంత ఉపశమనం లభించేది. అయితే గత యాసంగి, వానకాలం సీజన్లు రైతులకు ప్రభుత్వం సాయం అందించలేదు. కొందరికి సాయం ఇచ్చినప్పటికీ నాలుగు ఎకరాల వారికే అందింది. ఇప్పుడు సైతం సాయం అందిస్తామని హామీలు ఇచ్చారు. రైతులు మాత్రం ఆ సాయం కోసం ఎదురు చూడకుండా బ్యాంకు రుణం మీదనే ఆధార పడి ఉన్నారు. పంటను బట్టి ఎకరానికి రూ. 45వేలకు పైగా రుణం అందిస్తుండటంతో రుణాల కోసం రాజు బ్యాంకులకు రైతులు బారులుదీరుతున్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు, పాక్స్, యూనియన్ బ్యాంకుల్లో పంట రుణాలను రైతులు తీసుకుంటున్నారు. రుణాలు అందిస్తున్నప్పటికీ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆధార్ కార్డుతో ఫోన్ లింక్ ఉంటేనే రుణం అందుతుంది. రైతుల వివరాలు, భూమి వివరాలు బ్యాంకు యాప్ ద్వారా తీసుకోవాలంటే రైతుకు ఓటీపీ రావాల్సి ఉంది. ఓటీపీ వస్తేనే రైతు వివరాలతో కూడిన డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుంది. అలా డౌన్లోడ్ అయితేనే రైతుకు రుణం అందిస్తున్నారు. ఓటీపీ లేని రైతులకు రుణం అందడం లేదు. దీంతో చాలా మంది రైతులు ఓటీపీ రాక వెనుదిరిగి పోవాల్సి వస్తుంది. నెన్నెలలోని తెలంగాణ బ్యాంకుల్లో రోజుకు 20 మంది రైతుల వరకే రుణాలు ఇస్తున్నారు.