కాసిపేట, సెప్టెంబర్ 16 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని సహకార సంఘం వద్ద మంగళవారం చేపట్టిన యూరియా బస్తాల పంపిణీ కార్యక్రమం పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగింది. కేవలం 266 బస్తాలు మాత్రమే రావడంతో అధికారులు ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక్క పాస్ బుక్ కు ఒక బస్తా చొప్పున పంపిణీకి ఏర్పాట్లు చేశారు. రైతులు ఉదయం 3 గంటలమే వచ్చి యూరియా కోసం రైతు వేదిక, సహకార సంఘం కార్యాలయానికి చేరుకొని క్యూ కట్టారు.
వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి రైతు వేదికలో రైతులను కూర్చో బెట్టి లైన్ విధానంలో పాస్ బుక్స్ తీసుకొని ఒక్క పాస్ బుక్ కు ఒకటి చెప్పున బస్తా ఇచ్చే విధంగా రసీదు రాసి ఇవ్వడంతో సహకార సంఘం వద్ద రసీదు చూపిన వారికి బస్తా ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. రైతులు భారీగా తరలి రావడంతో ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఒక్కో బస్తా మాత్రమే ఇవ్వడంపై రైతులు అసహనానికి గురయ్యారు.
ఎన్ని ఎకరాలు ఉన్నా ఒకటే బస్తా ఇస్తే ఎలా సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విడుతల వారీగా వచ్చిన విధంగా రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నామని, మళ్ళీ వస్తాయని, రాగానే సమాచారం ఇచ్చి అందరికీ అందిస్తామని సహకరించాలని ఏవో చల్ల ప్రభాకర్ రైతులకు వివరించారు. ఏఈవో శ్రీధర్, సహకార సంఘం సీఈవో రాజశేఖర్ పాల్గొన్నారు.