తాండూర్, ఆగస్టు 8 : పోడు భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కొమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని దిందా గ్రామస్తులు 40 మంది చేపట్టిన పాదయాత్ర శనివారం రాత్రి తాండూర్‌కు చేరుకుని స్థానిక శ్రీరామ జిన్నింగ్ మిల్లులో బసచేశారు. తిరిగి శుక్రవారం ఉదయం తాండూర్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శివారులో ఉన్న భూముల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఆటవీశాఖ అధికారులు వేధింపులకు గురిచేస్తూ కంచెలు వేస్తూ భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ఆవేదనను రాజధానిలో తెలియజేసేందుకు పోడు భూముల సాధన ర్యాలీ పేరుతో హైదరాబాద్ లోని ప్రజాభవన్‌కు పాదయాత్రగా బయలుదేరామన్నారు. తమ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు పోరాడుతామన్నారు. దీందా నుంచి హైదరాబాద్ వరకు సుమారు 400 కి. మీ. దూరం ఉండటంతో వారం రోజులపాటు పాదయాత్ర కొనసాగనుంది. పోడు భూముల రక్షణకు తమదైన పోరుచేయాలన్న సంకల్పంతో రైతులు పాదయాత్ర చేస్తుండగా పలువురు మద్దతు తెలిపారు. సంబంధిత అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే భూవివాదాలకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.