తాండూర్, జూన్ 1 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం, గ్రామపంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రం ఐబీలో జాతీయ రహదారిపై సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్టీ పర్సస్ విధానాన్ని రద్దు చేసి కార్మికులని పర్మినెంట్ చేయాలన్నారు. బకాయి పడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలి. నెలకు రూ. 26 వేలు ఇవ్వాలని, సంవత్సరానికి ఒక్క కార్మికునికి రెండు జతల యూనిఫామ్ ఇవ్వాలని, బెల్లం, నూనె, సంవత్సరానికి రెండు జతల చెప్పులు, సబ్బులు ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కార్మిక సంఘాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్పుల శంకర్, బొల్లం రాజేశం, మొగిలి, హక్కు, అక్చర్, నందిపేట వెంకటి, ఇప్ప రామయ్య, ఇప్ప దుర్గు, ఇప్ప ఎల్లమ్మ, ఇప్ప సుజాత, కాజీపేట కమల, రామగిరి రాధా, కార్మికులు పాల్గొన్నారు.