బెల్లంపల్లి ఫిబ్రవరి 5 : మావోయిస్టులు(Maoists) అజ్ఞాతం వీడి.. జనజీవన స్రవంతిలో కలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్(CP Srinivas )సూచించారు. బుధవారం బెల్లంపల్లి మండలం చంద్రవెళ్లి గ్రామానికి చెందిన జాడి భాగ్య అలియాస్ పుష్ప, జాడి వెంకటి మావోయిస్టు దంపతుల తల్లి మల్లమ్మ ను సీపీ మంచిర్యాల డిసిపి భాస్కర్‌తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా పుష్ప తల్లి మల్లమ్మతో పాటు కుటుంబ సభ్యుల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు దుప్పట్లు, నిత్యావసర సరకులను అందజేశారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
వనం వీడి జనంలోకి వచ్చేలా చూడాలని, లొంగిపోతే ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు . ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి మావోయిస్టు పార్టీలో పని చేసి సాధించింది శూన్యమని స్పష్టం చేశారు. ఇకనైనా పుష్ప అజ్ఞాతం వీడి జనంలోకి రావాలని, ప్రస్తుత రోజుల్లో మావోయిస్టులకు ప్రజాదరణ తగ్గిందని పేర్కొన్నారు. అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు ఆరోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నారని వివరించారు.
ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యారని. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే వారిపై ఉన్న రివార్డ్ తో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు అందేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ ఆఫ్జలుద్దీన్, తాళ్లగురిజాల ఎస్ఐ రమేష్ పాల్గొన్నారు.