తాండూర్, నవంబర్ 18 : పత్తి కొనుగోళ్లలో కొర్రీలను పెడుతూ రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తెలంగాణ కాటన్ మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరవధిక బంద్ పిలుపులో భాగంగా తాండూర్ లో బంద్ కొనసాగుతోంది. దీంతో మంగళవారం కూడా తాండూర్ మండలం రేపల్లెవాడ శివారులోని మహేశ్వరి, వైభవ్ జిన్నింగ్ మిల్లులలో సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోగా, శ్రీరామ జిన్నింగ్ మిల్లులో కూడా ప్రైవేట్ కొనుగోళ్లు చేపట్టలేదు. పత్తి మిల్లులను మూసి వేసి బంద్ లో పాల్గొన్నారు.
బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని తాండూర్ మండలంలోని పత్తి మిల్లులు మూసి వేసి ప్రధాన గేట్లకు నిరవధిక బంద్ పాటిస్తున్నట్లు ఫ్లెక్సీలను కాటన్ మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేశారు. బంద్ పై ముందస్తుగా ప్రచారం చేయడంతో రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురాలేదు. దీంతో జిన్నింగ్ మిల్లుల ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ ప్రైవేట్ కంపెనీ అవతారమెత్తి రోజుకో విధానం అమలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదరుర్కోవాల్సి వస్తోందని మిల్లర్లు నిరవధిక బంద్ ను పాటించిన విషయం విదితమే. దీనితో తమ ఉత్పత్తులను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు పత్తి రైతులు వాపోతున్నారు.