కోటపల్లి, జూన్ 21: సాక్షాత్తు రాష్ట్ర మంత్రి వివేక్ నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో జనగామ రూట్లో బస్ రద్దు కాగా బస్ నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆ ప్రాంత నాయకులు వినతి పత్రం సమర్పించారు. కోటపల్లి మండలంలోని జనగామ గ్రామానికి చెన్నూర్ నుండి ఉదయం, సాయంత్రం బస్సు నడిచేది. ఈ బస్‌ను గత వారం రోజులుగా ఆర్టీసీ అధికారులు రద్దు చేయగా పారుపల్లి, లింగన్నపేట, ఎదుల్లబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, జనగామ, సూపాక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
బస్సులు లేక ఈ గ్రామాల్లోని ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనితో స్థానిక కాంగ్రెస్ నాయకులపై ఒత్తిడి పెరుగుతుండగా సిర్సా గ్రామ కాంగ్రెస్ నాయకులు ఒక అడుగు ముందుకు వేసి బస్ నడపండి సార్ అని చెన్నూర్‌లోని ఆర్టీసీ నాయకులకు వినతి పత్రం సమర్పించారు. మంత్రి నియోజకవర్గంలో బస్ రద్దు కావడం, సాక్షాత్తు కాంగ్రెస్ నేతలు ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. కాగా చెన్నూర్ నుంచి సిరోంచ-కాళేశ్వరం రూట్లో బస్సులను రద్దు చేయడంతో పాటు, పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బస్సులుగా బోర్డు మార్చి నడుపుతుండటంతో ఆ రూట్లోని గ్రామాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.