కోటపల్లి, ఆగస్టు 19 : మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం సందర్శించారు. కోటపల్లి మండలంలో తీవ్ర యూరియా కొరత ఏర్పడిన నేపథ్యంలో సరిహద్దులలో చెక్ పోస్టును అధికారులు ఏర్పాటు చేయగా ఈ చెక్ పోస్టును కలెక్టర్, సిపిలు ఇరువురు సందర్శించి చెక్ పోస్ట్ నిర్వహణ పైన పలు సూచనలు చేశారు.
యూరియా కొరత తీర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, యూరియాను డీలర్ల వద్ద నుండి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన రైతుల వివరాలు సేకరించి విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద 24 గంటల పాటు తనిఖీలు ఉంటాయని, యూరియా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకొనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వివరించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్ పాల్గొన్నారు.