తాండూర్, ఫిబ్రవరి 10: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అందరూ పాల్గొనాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం అన్నారు. మంగళవారం తాండూర్ మండల కేంద్రంలోని పీహెచ్సీ వైద్యురాలు ఝాన్సీరాణి, ఎమ్మార్సీ కార్యాలయంలో సిబ్బందికి సీఐటీయూ ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులతో కలిసి సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా రాజారాం మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025, వీబీజీ రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ ఐసీ లో 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను ఉపసంహరించుకోవాలన్నారు. అలాగే కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపుమేరకు ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఉద్యోగ, కార్మిక సంఘాలు, ఉద్యోగులు, ప్రజలు, ప్రజాతంత్ర వాదులు, ప్రజా సంఘాలు బీజేపీ మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటాలలో భాగ్యసాములై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.