తాండూర్, అక్టోబర్ 8: భూ భారతిలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య సూచించారు. బుధవారం తాండూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డులు పరిశీలించి తాసిల్దార్ జోష్ణ రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలు ఎన్ని? ఎన్నింటిని పరిష్కరించారు? పెండింగ్ లో ఉన్న ఆర్జీలు ఎన్ని అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమస్యలపై సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. విచారణ జరిపి అవసరమైతే నోటీసులు జారీ చేసి వాంగ్మూలాలను తీసుకుని న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు అనుమతి ఇచ్చినందున ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దరఖాస్తులను సిద్ధం చేసుకోవాలన్నారు.
ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే పరిష్కరించాలని, ఆసైన్డ్ భూములకు పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులలో అర్హుల జాబితా సిద్ధం చేయాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు. అనంతరం ఎన్నికల కోడ్ అమలుపై సూచనలు చేశారు. అయన వెంట తహశీల్దార్ జ్యోత్స్న, డిప్యూటీ తహశీల్దార్ కల్పన, సిస్టమ్ ఆపరేటర్ దాసరి మహేష్, సిబ్బంది ఉన్నారు.