మంచిర్యాల అర్బన్, జూలై 15 : వాహనాలకు సరైన నెంబర్ ప్లేట్లు కచ్చితంగా ఉండాలని మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డు, పలు ఏరియాల్లో పట్టణ సీఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ సిబ్బందితో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు, వాటిని గుర్తించి అక్కడికక్కడే నెంబర్ ప్లేట్ ఫిట్ చేయించి పైన్లు వేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా కావాలని నెంబర్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారు ఉన్న, నాలుగు అంకెల నెంబర్లను రెండు అంకెల నెంబర్ గా మార్చి చెక్కర్లు కొడుతున్న వారిని గుర్తించి వారిపై చీటింగ్ కేసు లు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.
నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేయడం ద్వారా దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఈ మధ్య కాలంలో బెల్లంపల్లి లో జరిగిన ఏటీఎం చోరీ కేసులో దొంగలు నెంబర్ లేని వాహనాన్ని వినియోగించారని పోలీసులు గుర్తించి వారిని పట్టుకున్న ఘటనను గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 10 తరువాత అత్యవసరం ఉన్న వారు తప్ప ఎవరు అనవసరంగా బయట తిరగవద్దని హెచ్చరించారు.
రాత్రి పూట వాహనాలు తనిఖీ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. కొంత మంది గంజాయి అలవాటు పడి ఆ మత్తులో దాడులకు పాల్పడుతున్నట్లు, వారి మీద ప్రత్యేక నిఘా ఉందని, పాత నేరస్థుల ఇండ్లకు సైతం వెళ్లి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఎవరు కూడా నేరాలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ముజురుద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.