ప్రత్యామ్నాయ పద్ధతిపై రైతుల ఆసక్తి
పెట్టుబడి అత్యల్పం.. దిగుబడి అధికం..
విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు
ఈ ఏడాది 1,081.1 ఎకరాల్లో పంట
మంచిర్యాల, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) ;నారు లేదు.. నాటు లేదు.. కూలీల కోసం ఎదురుచూసేది లేదు..కలుపు కూలీల ఇబ్బంది లేదు.. నీటి వినియోగం కూడా 30-35 శాతమే.. 10-15 రోజుల ముందు చేతికి పంట.. మామూలు పద్ధతిలో ఎకరాకు 25 కిలోల విత్తనాలు అవసరం. వెదజల్లే పద్ధతికి 12 కిలోలు సరిపోతుంది. ప్రస్తుతం లాభదాయకంగా ఉండడంతో ఔత్సాహిక రైతాంగం వెదజల్లే పద్ధతివైపు ఆసక్తి చూపుతున్నది. వ్యవసాయాధికారులు విస్తృతంగా ప్రచారం చేయడం, గ్రామగ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ యేడాది 1,080.1 ఎకరాల్లో పంట సాగవుతున్నది.
మంచిర్యాల జిల్లాలో వానకాలం, యాసంగిలో వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల కొరత ఎక్కువగా ఉంది. ఒకవేళ వారు అందుబాటులో ఉన్నా చిన్న, సన్నకారు రైతులు భరించలేని విధంగా కూలీల రేట్లు సమస్యగా మారాయి. దీంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలిగి.. సాగు ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు అధిక శ్రమతో కూడిన దమ్ము చేసి నాట్లు వేసే పద్ధతికి ప్రత్యామ్నాయంగా వెదజల్లే పద్ధతిపై ఆసక్తి చూపుతున్నారు. నేరుగా దమ్ము చేసిన పొలంలో వెదజల్లే పద్ధతి వల్ల సకాలంలో వరి సాగు చేసి.. ఖర్చులు తగ్గించుకొని అధిక ఆదాయాన్ని పొందే వీలుంటుందని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్ సూచిస్తున్నారు.
రైతుల ఆసక్తి..
అన్ని పద్ధతులకన్నా అతి సులువైన పద్ధతి వెదజల్లే పద్ధతి. పూర్వీకులు ఈ పద్ధతిని అనుసరించి గతంలో వరిని సాగు చేశారు. సమర్థవంతమైన కలుపు మందులు, గడ్డిజాతి, వెడల్పాకు, తుంగ కలుపు మొక్కలను అన్నింటినీ సమూలంగా నిర్మూలిస్తున్నాయి. ప్రస్తుతం రైతులందరూ వెదజల్లే పద్ధతి వైపు ఆకర్షితులవుతున్నారు. మంచిర్యాల జిల్లాలో 18 మండలాలుండగా, 12 మండలాల్లో 1081.1 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. 1,27,086 ఎకరాల్లో వరిని నాటు పద్ధతిలో కొనసాగిస్తున్నారు. భూగర్భ జలాలు పెరగడం, రైతులు వరి పంట వైపు మొగ్గు చూపడంతో వరి విస్తీర్ణం దాదాపు రెండింతలైంది. ప్రస్తుత తరుణంలో దమ్ము చేయడానికి, నారు పెంపకానికి, నారు వేసేందుకు, కలుపు నివారణ కోసం మహిళా కూలీలకు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతున్నది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వానకాలంలో వెదజల్లే పద్ధతిలో వరి పంట వేసే విధానాన్ని రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. జిల్లాలోని చెన్నూర్ మండలంలో అత్యధికంగా 500 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్నారు. బెలంపల్లి మండలంలో 100, కన్నెపల్లిలో 110, కోటపల్లిలో 200, జైపూర్‌లో 265, హాజీపూర్‌లో 120, దండేపల్లిలో 180, జన్నారంలో 90.1, కాసిపేటలో 13, తాండూర్ మండలంలో 30, భీమారంలో 60, లక్షెట్టిపేట మండలంలో 20 ఎకరాల్లో వరిని వెద పద్ధతిలో సాగు చేస్తున్నారు.
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి..
వెదజల్లే విధానం ద్వారా పంట ఏపుగా పెరగడంతో పాటు దిగుబడి కూడా బాగుంటుంది. కూలీల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. నారుపోసే అవసరం ఉండదు. కాబట్టి సాగు సులువవుతుంది. సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 30 కిలోల విత్తనాలు వాడితే ఈ విధానంలో ఎకరానికి 12 నుంచి 14 కిలోలు మాత్రమే అవసరమవుతాయి. ఈ విధానంలో తెగుళ్ల సమస్య పెద్దగా ఉండదు. నీటి వినియోగం కూడా తక్కువగా ఉండడంతో పాటు పంట కాలం తక్కువగా ఉంటుంది. నాటు వేసే అవసరం ఉండదు. కాబట్టి విత్తనాలు కూడా తక్కువగా అవసరం ఉంటుంది. ఈ పద్ధతిలో ఒక రైతు ఒక రోజులో మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు చల్లుకోవచ్చు. వెదజల్లే పద్ధతి ద్వారా సుమారు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.12 వేల పెట్టుబడి ఖర్చు తక్కువగా అవుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
విత్తే పద్ధతి ఇలా..
నేలను దమ్ము చేసి గొర్రుతో చదును చేసుకున్న వెంటనే బురదలో విత్తనాన్ని చల్లుకోకూడదు. బురదలో కూరుకుపోయిన విత్తనం సరిగా మొలకెత్తదు. అందుకే దమ్ము, గొర్రుతో చదును చేసిన పిదప మడిలో 5 సెంటీమీటర్లు నీటి మట్టాన్ని ఉంచి 6 నుంచి 24 గంటల వరకూ బురదను పేరుకునేటట్లు చేయాలి. తర్వాత ఆ పొలంలో 12 గంటలు నానబెట్టి 24 గంటలు మండెకట్టి, ముక్కులు పగిలిన వరి విత్తనాన్ని పొలమంతా సరిసమానంగా నైపుణ్యంతో వెదజల్లుకోవాలి. వెదజల్లిన తర్వాత రెండు నుంచి మూడు కిలోల బండను ప్లాస్టిక్ సంచిలో ఉంచి మొలక చల్లిన పొలంలో ప్రతి మూడు మీటర్ల కొకసారి నిలువుగా లాగాలి. ఈ రకంగా తయారు చేసిన కాలువల్లో పొలంలోని నీరు చేరడంతో మొలక ఎత్తుమడులపై ఉండడంతో చక్కగా మొలకెత్తుతుంది.
ఆయకట్టు రైతులకు వరం..
కలుపు మందులు వివిధ రకాల పేర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని నేరుగా వాడుకోవచ్చు. ఒక్కసారి సరైన సమయంలో సరైన మోతాదులో పిచికారీ చేస్తే కూలీలతో కలుపుతీయాల్సిన అవసరం ఉండదు. ఈ పద్ధతులు అవలంబించి జిల్లాలో దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ఈ విధానంలో రైతులకు విత్తనానికి, నాటడానికి, కలుపు తీతకు అయ్యే ఖర్చు తగ్గడంతో ఎకరానికి దాదాపు రూ.6 వేల నుంచి 8 వేల వరకు ఆదా అవుతుంది. చాలా మంది రైతులు నాటు పద్ధతికి సమానంగా లేదా అంతకుమించి దిగుమతులను పొందుతున్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు గుర్తించి పాటిస్తున్నారు. దీంతో సకాలంలో సాగు చేయడమే కాకుండా కూలీల అవసరం లేకుండానే వరిని తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా సాగు చేయవచ్చు. ముఖ్యంగా ఆయకట్టు రైతులకు ఇది ఒక వరం. ఈ పద్ధతిని అవలంబించేం దుకు, ఆసక్తి చూపించి సాగు చేసి లబ్ధిపొందేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
రైతులు ఆసక్తి చూపుతున్నారు
కూలీల కొరతతో సంబంధం లేదు. నీటి అవసరం ఎక్కువగా లేదు. ప్రస్తుతం యువ రైతులందరూ వెదజల్లే పద్ధతి వైపు ఆసక్తి చూపుతున్నారు. సరైన సమయంలో సరైన మోతాదులో పిచికారీ చేస్తే కూలీలతో కలుపుతీయాల్సిన అవసరం ఉండదు. ఈ పద్ధతులు అవలంబించి జిల్లాలో వెయ్యి ఎకరాలకు పైగా సాగు చేస్తున్నా రు. రైతులకు విత్తనానికి, నాటడానికి, కలుపు తీతకు అయ్యే ఖర్చు తగ్గ డంతో ఎకరానికి దాదాపు రూ.6 వేల నుంచి 8 వేల వరకు ఆదా అవుతుం ది. ప్రభుత్వ సూచనల మేరకు ఈ విధానంపై రైతులకు విస్తృతంగా అవ గాహన కల్పిస్తున్నాం. – వినోద్‌కుమార్, మంచిర్యాల జిల్లా వ్యవసాయాధికారి