రాఖీట్ల పున్నంపై కరోనా ప్రభావం
గతేడాది విజృంభణతో పుట్టింటికి రాలేకపోయిన అక్కాచెల్లెళ్లు
ఏడాది కాలంలో ఎందరినో దూరం చేసిన మహమ్మారి
ఎంతో మంది తోబుట్టువులకు చేదు జ్ఞాపకాలు
పండుగపూట గతస్మృతులను తలుచుకుంటూ కన్నీళ్లు‘
మంచిర్యాల(నమస్తే తెలంగాణ)/దహెగాం/లక్షెట్టిపేట రూరల్/మంచిర్యాలటౌన్/తాంసి, ఆగస్టు 21;‘ఆప్యాయంగా తలనిమిరే అభయహస్తాలు ఎక్కడున్నాయి అన్నా.. శిరస్సు వంచి నమస్కరించిన చేతులు.. దీవెనలు అందుకున్న ఆ క్షణాలు ఏమయ్యాయి తమ్మీ.. అన్నా అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచే గొంతు మూగబోయిందా చెల్లి.. ఆ మాయదారి రోగం మన ఇంటిల్లిపాదిని ఎంత దుఃఖంలో ముంచిందో అక్కా..” అంటూ పలువురు అన్నా చెల్లెళ్ల్లు.. అక్కాతమ్ముళ్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన ఏడాది కాలంలో వందలాది మంది మృతిచెందగా, తోబుట్టువులను కోల్పోయిన అక్కా చెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు పండుగ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కుమిలిపోతున్నారు. రక్ష కట్టించుకొని మురిసిపోయిన అన్నదమ్ముళ్ల జాడ లేక సోదరీమణులు.. నోరు తీపి చేసే అక్కాచెల్లెళ్లు రూపు లేదని సోదరులు మనోవేదన చెందుతున్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’తో చెప్పుకొంటూ ఉద్వేగానికిలోనయ్యారు. ‘ఏడున్నవ్ తమ్ముడా.. ఎప్పుడొస్తవ్ అక్కా’ అంటూ పండుగ పూట నాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ బోరుమన్నారు.
మా అమ్మ పేరు శంకరబాయి, నాన్న దస్రు. నాకు ఒక్కడే అన్నయ్య విఘ్నేష్ ఉండే. పోయినేడాది (నవంబర్ 11) మా అన్న ఇద్దరు పక్కింటి పిలగాండ్లతో కలిసి చేపలు పట్టడానికి వాగుకు పోయిండు. పట్టిన చేపలను ఆకుల్లో వేసుకొని తెద్దామనుకున్నరు. ఒడ్డుకు పోయి ఆకులు తెంపుతుంటే పులి దాడి చేసి చంపింది. అక్కడున్న పిలగాండ్లు ఊల్లెకు ఉరికి వచ్చిన్రు. నేను కోటపల్లి గురుకులంలో చదువుకుంటున్న (పదో తరగతి పూర్తి). రాఖీ పండుగకు ప్రతి సంవత్సరం ఒకరోజు ముందుగాలే ఇంటికి వచ్చేదాన్ని. రాఖీ కట్టిన తర్వాత అన్నయ్య నా కాళ్లు మొక్కి కట్నం పెట్టేటోడు. నాకు అన్నంటే మస్తు ఇష్టం. నన్ను మంచిగ చూసుకునేటోడు. ఇప్పుడు లేకపాయే. ఇగ ఎవరికి రాఖీ కట్టాలె. దేవుడిట్ల చేస్తడనుకోలేదు. గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏడుస్తుంట. అమ్మానాన్న కూడా మస్తు బాధపడుతరు. తలుచుకొని ఊకే ఏడుస్తురు. మా అన్న మంచిగ చదివేటోడు. ఉట్నూర్ ఐటీడీఏ కాలేజీలో ఇంటర్ పాసైండు.
అమ్మలోని ప్రేమను, నాన్నలోని బాధ్యతను స్వీకరించే సోదరుడికి సోదరి కట్టే కంకణమే రక్షాబంధన్. ప్రతి శ్రావణ పౌర్ణమిన తోడబుట్టిన వాళ్లకు రాఖీ కట్టి, తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లంతా కోరుకుంటారు. తమ అన్న, తమ్ముడి నోరు తీపి చేసి వారంతా జీవితాంతం సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తారు. ఇలా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి రాఖీ పండుగ ఒక వారధిలా నిలుస్తున్నది. అయితే, కరోనాతో ఈసారి పండుగను భిన్నవాతావరణంలో నిర్వహించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వైరస్ విజృంభణతో గతేడాది చాలా మంది పండుగకు దూరంగా ఉన్నారు. ఎంతో మంది అక్కాచెల్లెళ్లు తమ పుట్టింటికి రాలేకపోయారు. తమ తోబట్టువులకు రాఖీ కట్టలేకపోయారు. ఒక్క ఏడాదే కదా అని గుండె దిటవు చేసుకున్నారు. కానీ, ఈ యేడాది కాలంలో ఎంతో మంది కరోనా బారిన పడి అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలి కాలంలో కరోనా తగ్గుముఖం పట్టిందని సంతోషపడినా పండుగ పూట కొందరికి దుఃఖమే మిగులుతున్నది.
ఆత్మీయ బంధం
అమ్మలోని ప్రేమను, నాన్నలోని బాధ్యతను స్వీకరించే సోదరుడికి సోదరి కట్టే కంకణమే రక్షాబంధన్. ప్రతి శ్రావణ పౌర్ణమిన తోడబుట్టిన వాళ్లకు రాఖీ కట్టి, తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లంతా కోరుకుంటారు. అన్న, తమ్ముడి నోరు తీపి చేసి వారంతా జీవితాంతం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తారు.
మెట్టి నుంచి పుట్టింటికి : రాఖీ పండుగ రోజున అక్కా చెల్లెళ్లు తప్పనిసరిగా పుట్టింటికి చేరుతారు. అన్నదమ్ములకు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపిస్తారు. సోదరులు తమకు తోచినంత అక్కా చెల్లెళ్లకు కట్నం పెడతారు. ఆడపడుచులు ఆశీర్వచనాలు ఇస్తారు. అన్నదమ్ములతో కష్టసుఖాలు చెప్పుకొని స్వాంతన పొందుతారు.
ఇంట్లో సందడి : రాఖీ కట్టేందుకు వచ్చిన ఆడబిడ్డలతో పుట్టింట్లో సందడి నెలకొంటుంది. స్వీట్లు, పాయసంతో నోరు తీపిచేసుకోవడం కనిపిస్తుంది. కబుర్లతో కాలం ఇట్టే గడిచిపోతుంది. ఈ రకంగానైనా ఓసారి ఆడబిడ్డలకు పుట్టింటికి వచ్చే అవకాశం దక్కుతుంది.
సోదరులకే కాదు : తోబుట్టువులకే కాక, సోదర వాత్సల్యంతో ప్రతి ఒక్కరికీ రాఖీలు కట్టవచ్చు. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు మన జాతీయ నేతలు ఈ రక్షాబంధన్‌ను ఒక అస్త్రంగా ఉపయోగించారు కూడా. యుద్ధాలను నివారించిన ఘనత కూడా ఈ కంకణానికి ఉంది.
‘విశ్వజనీన స్ఫూర్తి’: ‘రాఖీ బంధం’ కేవలం సోదర సోదరీమణుల మధ్యేకాకుండా, మానవీయతతో కూడిన కరుణాంతరంగ వేడుకగా జరుపుకోవాలి’. అని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపునిచ్చారు. హిందువులు, ముస్లింల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు ‘రక్షాబంధన్’ ఉత్సవాన్ని వేదికగా చేసుకోవడంతో అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.
ఆపదలు దూరం : రాఖీ ధారణతో ఏడాదిపాటు దుష్ట, ప్రేత, పిశాచ బాధలు ఉండవని, ఎలాంటి ప్రమాదాలూ జరగవనీ, అనారోగ్యం దరిచేరదని హిందువులు నమ్ముతారు.
ఇదీ పురాణం : బలి చక్రవర్తితో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన ఇంద్రుడు, తన స్వర్గాధిపత్యాన్ని కోల్పోతాడు. పూర్వవైభవం కోసం విష్ణువు దగ్గరకెళ్లి మొరపెట్టుకునేందుకు సిద్ధమవుతాడు. ఆ తరుణంలో భర్త విజయాన్ని కాంక్షిస్తూ, ఇంద్రుడి భార్య శచీదేవి, ఆదిపరాశక్తిని స్మరిస్తూ కంకణం కడుతుంది. అదే తొలి రాఖీ అని పురాణాలు చెబుతున్నాయి.
కరోనా ముప్పు తొలగిపోలేదు
కరోనా ప్రభావం తగ్గిపోలేదు. ఇంకా వెంటాడుతూనే ఉంది. దాదాపు రెండేళ్లుగా ప్రజలను ముప్పు తిప్పలు పెట్టింది. ఫస్ట్ వేవ్.. తర్వాత సెకండ్ వేవ్ అంటూ ఎంతో మందిని బలితీసుకుంది. వైరస్ హెర్డ్ ఇమ్యూనిటీ తగ్గడం, వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతో కరోనా ప్రభావం తగ్గింది. కానీ అక్కడక్కడా మళ్లీ విజృంభిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఇక రాఖీ పండుగ సందర్భంగా ఆడబిడ్డలు, అన్నదమ్ములు జాగ్రత్తలు పాటించాలి. భౌతికదూరం.. మాస్కులు కూడా పండుగ ప్రశాంతంగా జరుగుతుంది. అందరికీ ఆరోగ్యం బాగుంటుంది.
కరోనా తమ్మున్ని పొట్టనబెట్టుకుంది
మంచిర్యాలటౌన్, ఆగస్టు 21 : రాఖీ పండుగ వస్తుందంటే చాలా బాధగా ఉన్నది. నాకు ముగ్గురు సోదరులు. చాలా ఏండ్ల కింద ఇద్దరు తమ్ముళ్లు పాణం బాగాలేక చనిపోయిన్రు. ఇగ అందరికంటే చిన్నతమ్ముడు గరిగిశెట్టి నర్సయ్య (72) మంచిర్యాలలోని రెడ్డి కాలనీలో ఉండేటోడు. పోయిన సంవత్సరం (ఆగస్టు 27న) కరోనాతో చనిపోయిండు. నన్ను మస్తు ప్రేమగా చూసుకునేటోడు. మంచీ చెడ్డలు చెప్పేటోడు. నా చిన్నతనం నుంచి రాఖీ కడుతున్న. ఈసారి రాఖీ పండుగకు మా తమ్ముడు లేకపాయె. మస్తు రంది అయితంది. ఎవరికి రాఖీ కట్టను. గీ కరోనా పాడుగాను ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో నా తమ్మున్ని పొట్టనబెట్టుకుంది. నాకిప్పుడు 82 ఏండ్లు. అందరికంటే పెద్దదాన్ని. తమ్ముళ్లందరూ చనిపాయె. ఇగ నా మంచీ చెడ్డలు అడిగేటోళ్లు లేకుంటైన్రు.
పలువురు తోబుట్టువుల కన్నీళ్లు
కరోనా ఎంతో మంది జీవితాల్లో విషాదాన్ని నింపింది. అన్నదమ్ముళ్లను, అక్కాచెల్లెండ్లను ఎడబాపింది. వందలాది మందిని బలిగొంది. అయితే ఆడబిడ్డలు, అన్నదమ్ములు గత పండుగ తీపిజ్ఞాపకాలు మరిచిపోకముందే ఇంతలోనే పండుగ రానే వచ్చింది. తోబుట్టువులను కోల్పోయిన అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెండ్లు రాఖీ పండుగ వేళ అనుబంధాలను గుర్తు తెచ్చుకుంటూ కుమిలిపోతున్నారు. అమ్మలోని ఆప్యాయతను, నాన్నలోని అనురాగాన్ని కలగలిపిన అన్న, ఊహతెలిసినప్పటి నుంచి అల్లారుముద్దుగా కలిసి పెరిగిన తమ్ముడి జాడలేక లేకపోవడంతో మౌనంగా రోదిస్తున్నారు. ఇటు ఎంతో మంది అక్కాచెల్లెండ్లను కోల్పోయి తమకు రాఖీ కట్టేదెవరని అన్నదమ్ములు కన్నీటి పర్యంతమవుతున్నారు.