మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సెమినార్
హాజరైన ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్
హాజీపూర్, ఆగస్టు 21 : ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్యోజన్’ ద్వారా పల్లెలు, కుగ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమావేశ మందిరంలో ‘భారత్ కి ఆజాద్‌కా అమృత్ మహోత్సవం’లో భాగంగా శనివారం పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు చేసిన సెమినార్లో ఎమ్మెల్సీ పురా ణం సతీశ్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, పంచాయతీ రాజ్ ఈఈ ప్రకాశ్‌తో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లెల్లో రోడ్ల నిర్మాణాలు చేపడితే అభివృద్ధి కూడా శరవేగంగా జరుగుతుందన్నారు. సాధ్యమైన వరకు సాంకేతికతను ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాలను, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రానికి అనుసంధానం చేసేలా అధికారులు చొరవ చూపాలన్నారు.
2000 సంవత్సరంలో మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రధాన మంత్రి సడక్ యోజనా కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. గ్రామీణ ప్రాంతాలను కలుపుకొని రోడ్లు, కల్వర్టులు, వంతెనల నిర్మాణాలతో పాటు గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ పథకం ఫేజ్-1లో రూ. 201 కోట్లతో 80 పనులను చేపట్టామన్నారు. ఫేజ్-2లో రూ. 53 కోట్ల 62 లక్షలతో 12 పనులు, ఫేజ్-3లో బ్యాచ్-1లో రూ. 31 కోట్ల 21 లక్షలతో వ్యయంతో 7 పనులు, బ్యాచ్-2లో రూ. 42 కోట్ల 39 లక్షల వ్యయంతో 15 పనులు చేపట్టామని, ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రోడ్ల నిర్మాణం లో ఇంజినీరింగ్ అధికారులు, గుత్తేదారుల పాత్ర కీలకమైందన్నారు. నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో కాకరాల నరేందర్, జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ డీఈలు, గుత్తేదారులు, జడ్పీటీసీలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
26 లోగా పనులు పూర్తి చేయాలి
ఈ నెల 26న నిర్వహించనున్న సర్వసభ్య సమావేశం రోజున జడ్పీ సమావేశ మందిరాన్ని ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. పనులను శనివారం ఆమె పరిశీలించి అధికారులు సలహాలు, సూచనలు చేశారు. 150 మంది కూర్చునేలా హాలు సామర్థ్యం ఉందని అవసరమైన వేదిక, అధికారులు, ప్రజాప్రతినిధులు, సభ్యులకు అనుగుణంగా ప్రొటోకాల్ ప్రకారం కుర్చీలు, ఇతరాత్ర సౌకర్యాలను సమకూర్చాలన్నారు. ఆమె వెంట జడ్పీ సీఈవో కాకరాల నరేందర్, పంచాయతీ రాజ్ ఈఈ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.